జిల్లాకు రెండు విప్ పదవులు
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:03 AM
జిల్లాకు రెండు విప్ పదవులు వచ్చాయి.
చిత్తూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు రెండు విప్ పదవులు వచ్చాయి. శాసనమండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, శాసనసభలో జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామ్‌సలకు ఈ అవకాశం దక్కింది. అసెంబ్లీలో ఓ చీఫ్ విప్, 15 మంది విప్‌లతో.. మండలిలో ఓ చీఫ్ విప్, ముగ్గురు విప్‌లతో రెండు జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది.ప్రకాశం జిల్లాకు చెందిన కంచర్ల శ్రీకాంత్ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉన్నా ఓ ప్రణాళిక ప్రకారం గెలుపును దక్కించుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయనకు కుప్పం నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలోని సీనియర్లను, శ్రేణుల్ని సమన్వయం చేసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. గత ఎన్నికల్లో కుప్పంలో మెజార్టీ సాధన కోసం ప్రణాళికా బద్ధంగా అందరితో కలిసి పనిచేశారు.ఇకపోతే థామస్ మీద ప్రత్యేక దృష్టితో పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఆయనకు జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఫెర్టిలిటీ డాక్టర్‌గా పేరుగాంచిన ఆయన తక్కువ సమయంలో రాజకీయాల్ని అలవాటు చేసుకుని ఎన్నికల్లో మంచి విజయం సాధించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన ఆయనకు మంత్రి మండలిలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పుడు విప్‌గా అవకాశం ఇచ్చారు.వీరికి పదవులు రావడంతో కుప్పం, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.