Share News

జగనన్న కాలనీలపై విజి‘లెన్స్‌’

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:17 AM

జగనన్న కాలనీల్లో అవినీతి, అక్రమాలపై విజిలెన్సు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 5 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న రెండు ప్రాంతాల్లోనే ఇప్పటికి రూ.4.56 కోట్ల అవినీతి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

జగనన్న కాలనీలపై విజి‘లెన్స్‌’

ముమ్మరంగా దర్యాప్తు

రెండు ప్రాంతాల్లోనే రూ.4.56 కోట్ల అవినీతి జరిగినట్లు అంచనా

జగనన్న కాలనీల్లో అవినీతి, అక్రమాలపై విజిలెన్సు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 5 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న రెండు ప్రాంతాల్లోనే ఇప్పటికి రూ.4.56 కోట్ల అవినీతి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. వీటిపై విజిలెన్సు డీజీ హరీ్‌షకుమార్‌ గుప్తాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆయన విచారణకు ఆదేశించారు. విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ నేతృత్వంలో మూడు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి

ఏర్పేడు మండలం చిందేపల్లి, చంద్రగిరి మండలం ఎం.కొత్తపల్లి ప్రాంతాల్లో నిర్మించదలచిన దాదాపు 5000 జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వం థర్డ్‌ ఆప్షన్‌ కింద ఓ కంపెనీకి కట్టబెట్టింది. ఒక్కో ఇంటికి రూ1.80లక్షలు మంజూరు చేసింది. ఇందులోనే సిమెంటు, కమ్మీ, ఇతర ముడిపదార్థాలను నేరుగా హౌసింగ్‌ శాఖ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇక్కడ్నుంచే కొందరు అక్రమాలకు తెరతీసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఫిర్యాదులపై విజిలెన్సు విచారణ చేపట్టింది. చిందేపల్లిలో నిర్మించదలచిన దాదాపు 3500 గృహాల్లో పూర్తి కానివి దాదాపు 80 శాతం వరకున్నాయి. వీటిలో పునాది దశ దాటని ఇళ్లకు, పునాదులు పూర్తయినట్లు ఎం.బుక్కుల్లో నమోదు చేసి నిధులు స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. అలాగే గోడలు నిర్మించిన దశలో దాదాపు 800 ఇళ్లు ఉండగా వాటికి మోల్డింగ్‌ పూర్తయినట్లు లెక్కలు చూపినట్లు అధికారుల తనిఖీల్లో తెలిసిందని సమాచారం. పునాది పడని ఇళ్లకూ పినట్లు ఎం.బుక్కులు నమోదైనట్లు సమాచారం. ఇక, ఎం.కొత్తపల్లిలో నిర్మించదలచిన 1500 ఇళ్లలో కనీసం 60 శాతం ఇళ్ళు కూడా పూర్తికాకనే బిల్లులు రాసుకున్నట్లు.. చాలా ఇళ్లు పూర్తికాకున్నా పూర్తయినట్లు ఎం.బుక్కులు నమోదు చేసి నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంటు ఇవ్వాల్సి ఉండగా, 40 నుంచి 45 మాత్రమే ఇచ్చి పూర్తిగా ఇచ్చినట్లు.. పునాది దశలో ఉన్న ఇళ్లకు గోడలు దశ పూర్తయిందని.. ఇక, మోల్డింగ్‌కు దాదాపు 2500 ఇళ్లు ఉన్నాయని లెక్కలు చూపి నిధులు పక్కదారి పట్టినట్లు విజిలెన్సు అధికారులు తనిఖీల్లో బయటపడినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు రూ.4.56 కోట్లు దుర్వినియోగమైనట్లు ఇప్పటి వరకున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఈ అక్రమాల వెనుక ఎవరెవరున్నారనే దిశగానూ దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి విచారణ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.

Updated Date - Dec 23 , 2024 | 01:17 AM