Share News

కరువు సీమలో జలసంపద

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:09 AM

విభజన తర్వాత తిరుపతి జిల్లాకు అపారమైన మత్స్య సంపద కలిసివచ్చింది. ఏకంగా 80 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం వరంగా వచ్చింది. 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల పులికాట్‌ సరస్సులో అత్యధికభాగం జిల్లాలో భాగం అయింది.

కరువు సీమలో జలసంపద

తిరుపతి జిల్లాలో మత్స్య సంపదద్వారా ఏటా రూ. 700 కోట్ల ఆదాయం

కథనం: తిరుపతి, ఆంధ్రజ్యోతి

విభజన తర్వాత తిరుపతి జిల్లాకు అపారమైన మత్స్య సంపద కలిసివచ్చింది. ఏకంగా 80 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం వరంగా వచ్చింది. 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల పులికాట్‌ సరస్సులో అత్యధికభాగం జిల్లాలో భాగం అయింది. గూడూరు ప్రాంతాంలోని ఆక్వా కూడా మన ఖాతాలో చేరింది. దీంతో ఏడాదికి 80 వేల టన్నుల మత్స్యసంపద ఉత్పత్తి అవుతున్న జిల్లాగా తిరుపతి మారింది. దీని ద్వారా ఏటా రూ.700 కోట్లు ఆదాయం జిల్లాకు రావడం విశేషం.

రూ. 300 కోట్ల సముద్ర సంపద

2022 ఏప్రిల్‌లో తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. అంతకు మునుపుదాకా ఉమ్మడి జిల్లాలో స్థానిక చెరువులు, ప్రాజెక్టులు తప్ప చెప్పుకోదగ్గ మత్స్యసంపద జిల్లాలో లేదు. ఈ మత్స్య సంపద స్థానిక అవసరాలకే సరిపోయేది. తిరుపతి జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచీ 14 మండలాలు చేరడంతో జిల్లా స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోయాయి. కోట, వాకాడు, చిల్లకూరు, సూళ్ళూరుపేట, తడ మండలాలు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి వున్నాయి. ఈ ప్రాంతంలో 70 వేల మత్స్యకార జనాభా వుండగా 12 వేల మందికి పైగా చేపలు పట్టడాన్ని ఉపాధిగా మార్చుకుని జీవిస్తున్నారు. దీంతో 80 కిలోమీటర్ల సముద్ర తీరం జిల్లాకు ఆదాయ వనరుగా మారింది. ఏటా సముద్రం నుంచీ 8744 టన్నుల మత్స్య సంపదను జిల్లా మత్స్యకారులు వెలికి తీస్తున్నారు. వీటిని వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయించడం ద్వారా ఏటా రూ. 300 కోట్ల మేరకు ఆదాయం పొందుతున్నారు.

సముద్రంలో దొరుకుతున్నవి: కానగత్తలు, కవళ్ళు, వంజరం, చందువ, తూర, తాటాకు, టేకు, సొర, మిల్క్‌, పండుగప్ప, టైగర్‌ రొయ్య, తెల్ల రొయ్య, పచ్చ పీతలు, చుక్కల చేపలు.

మన జాక్పాట్‌ పులికాట్‌

ఏపీ, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో 461 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన పులికాట్‌ సరస్సు సింహ భాగం మన జిల్లాలోనే వుంది. తమిళనాడు పరిధిలో కేవలం 61 చదరపు కిలోమీటర్లు వుండగా ఏపీలో అంటే మన జిల్లాలో 400 కిలోమీటర్లు విస్తరించి వుంది. 168 రకాల చేపలు, రొయ్యలు ఇందులో లభిస్తాయి. పది వేల మంది మత్స్యకారులు సరస్సుపై ఆధారపడి బతుకుతున్నారు. వీటి విక్రయాల ద్వారా రూ. 60 కోట్ల దాకా జాలర్లు ఆదాయం గడిస్తున్నారు. గతేడాది పులికాట్‌ సరస్సు నుంచీ రొయ్యలు మాత్రమే 10,511 టన్నులు ఉత్పత్తి అయ్యాయి.

పులికాట్‌లో దొరికేవి: మొయ్య, జెల్ల, పైలెట్‌, పీతలు, రొయ్యలు.

పెంపకం చేపలు, రొయ్యలు ద్వారా రూ.400 కోట్లు

చేపలూ రొయ్యల పెంపకం కూడా జిల్లాకు భారీ ఆదాయం తెచ్చిపెడుతోంది. జిల్లాలో మొత్తం 560 చెరువులు, మూడు రిజర్వాయర్లలో 1.13 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మంచి నీటి రకాల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. వంద ఎకరాల్లో చేపల చెరువులు, 9417 ఎకరాల్లో రొయ్యల చెరువులను ఆక్వా రైతులు సాగు చేస్తున్నారు. గతేడాది లెక్కలు పరిశీలిస్తే దేశీయ చేపల ఉత్పత్తి 60915 టన్నులు కాగా రొయ్యల ఉత్పత్తి 2713 టన్నులు. వీటి ద్వారా జిల్లాకు రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది.

పెంచుతున్నవి: కట్లా, రోహు, మృగాల, కొరమీను, బంగారు తీగ, రూప్‌ చంద్‌, గండిచేప, తిలాపియా రకం చేపలు.

పూడిక తొలగిస్తే..

పులికాట్‌ సరస్సులో పూడిరాయి దొరువు వద్ద సముద్ర ముఖ ద్వారాలు పూడిపోయిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా ప్రభుత్వం పూడిక తొలగింపు మీద దృష్టి పెట్టకపోవడంతో జిల్లా భారీ ఎత్తున మత్స్య సంపదను కోల్పోతోంది. తాజాగా కూటమి ప్రభుత్వం పూడిక తొలగింపు కోసం రూ. 97 కోట్లు విడుదల చేసింది. సంబంధిత పనులు త్వరగా పూర్తయితే సరస్సులో మత్స్య సంపద మరిన్ని రెట్లు ఎక్కువ ఉత్పత్తి కావడంతో పాటు జిల్లాకు అంతే స్థాయిలో ఆదాయం కూడా పెరిగే అవకాశముంది.

Updated Date - Nov 21 , 2024 | 01:09 AM