కుంకీలతో గజదాడులను అరికడతాం
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:26 AM
జనావాసాలు, పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టేందుకు త్వరలో కుంకీ ఏనుగులతో రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ అజయ్‌కుమార్ నాయక్, తిరుపతి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం తెలిపారు.
ఫచీఫ్ కన్జర్వేటర్ అజయ్‌కుమార్ నాయక్
కల్లూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జనావాసాలు, పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టేందుకు త్వరలో కుంకీ ఏనుగులతో రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ అజయ్‌కుమార్ నాయక్, తిరుపతి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం తెలిపారు. పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ సమీపంలోని తూర్పు అటవీ ప్రాంతాన్ని శనివారం సాయంత్రం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా డీఎఫ్‌వోలు భరణి, వివేక్, జగన్నాధసింగ్‌లతో కలిసి వారు పరిశీలించారు. పలమనేరు కౌండిన్య అటవీప్రాంతం నుంచి రెండేళ్ల క్రితం పులిచెర్ల మండలంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్న నేపధ్యంలో ఏనుగులు దాడులు చేస్తున్న తీరు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఏనుగుల గుంపు సంచరించే అటవీ ప్రాంతాలను మ్యాప్‌లో పరిశీలించారు.ఈ సందర్భంగా అజయ్‌కుమార్ నాయక్ మాట్లాడుతూ ఏనుగుల గుంపు జనారణ్యంలోకి వస్తుండడంతో జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.గజదాడులను కుంకీ ఏనుగుల సాయంతో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఏనుగుల గుంపును కౌండిన్య అటవీప్రాంతం వైపు తీసుకెళ్లేందుకు కుంకీ ఏనుగులను తీసుకొస్తామని తెలిపారు.ఫ్లయింగ్‌స్కాడ్ డీఎఫ్‌వో గురుప్రభాకర్, మదనపల్లె సబ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఎఫ్‌ఆర్‌వోలు థామస్ సుకుమార్, ప్రియాంక, వేణుగోపాల్, మాధవి, ఫ్లయింగ్ స్కాడ్ ఎఫ్‌ఆర్‌వో చంద్రశేఖర్, డిప్యూటీ రేంజర్ కుప్పుస్వామి, ఎఫ్‌ఎస్‌వో మహ్మద్ షఫీ, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.
పంటలపై కొనసాగిన గజదాడులు
పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీలో శుక్రవారం రాత్రి పంటలపై గజదాడులు కొనసాగాయి. కొబ్బరి, వరి, మామిడి పంటలకు అపారనష్టం వాటిల్లింది. కుమ్మరపల్లిలో సి. కృష్ణయ్యకు చెందిన 11 కొబ్బరిచెట్లు, 3 మామిడిచెట్లు, ఎం. కృష్ణయ్యకు చెందిన 3 మామిడిచెట్లతో పాటు పశుగ్రాసాన్ని ఏనుగులు ధ్వంసం చేశాయి.వంకాయలపాటివారిపల్లిలో రవీంద్రనాయుడికి చెందిన ఎకరా వరిపంటను ధ్వంసం చేసిన ఏనుగులు 20 మామిడిచెట్లను విరిచేశాయి.