పరిపాలన పట్టాలెక్కేదెప్పుడు?
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:45 AM
తిరుపతి జిల్లాలో పాలనకు, అభివృద్ధికి సారధ్యం వహించేదెవరు? అధికార పార్టీని, పాలనను నడిపించేదెవరు? జిల్లాకు మంత్రి పదవి దక్కని నేపఽథ్యంలో నాయకత్వమూ కరువైన వేళ అందరిలో కదలాడుతున్న ప్రశ్నలివి. మరోవైపు జిల్లాలో అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియ సైతం మొదలు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశాక అధికారికంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పాలనపై దృష్టి సారించనున్నారు.
టీడీపీని, పాలనను నడిపించేదెవరు?
మంత్రి లేకపోగా నాయకత్వమూ కరువు
తిరుపతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాలనకు, అభివృద్ధికి సారధ్యం వహించేదెవరు? అధికార పార్టీని, పాలనను నడిపించేదెవరు? జిల్లాకు మంత్రి పదవి దక్కని నేపఽథ్యంలో నాయకత్వమూ కరువైన వేళ అందరిలో కదలాడుతున్న ప్రశ్నలివి. మరోవైపు జిల్లాలో అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియ సైతం మొదలు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశాక అధికారికంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పాలనపై దృష్టి సారించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియ చేపట్టనుంది. దీంతో గత మార్చిలో ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచీ స్తంభించిన జిల్లా పాలన తిరిగి పట్టాలెక్కేందుకు మరింత వ్యవధి పట్టే అవకాశముంది.రాష్ట్ర మంత్రివర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటైపోయింది. ఇంకా ఒకరిని మంత్రిగా నియమించేందుకు సాంకేతికంగా అవకాశం వుంది కానీ నియమిస్తారో లేదో తెలియని పరిస్థితి.దీంతో జిల్లా నుంచీ ఎవరికైనా మంత్రి పదవి వస్తుందన్న ఆశలైతే ప్రస్తుతానికి లేవు. అందువల్ల జిల్లాలో ప్రభుత్వ పాలనకు, అభివృద్ధికి నాయకత్వం ఎవరు వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. అసెంబ్లీ మొదటి సమావేశాల అనంతరం ఇంఛార్జి మంత్రుల నియామకం జరుగనుంది. ఆ క్రమంలో జిల్లాకు కూడా ఇంఛార్జి మంత్రి రానున్నారు. అయితే ఇంఛార్జి మంత్రి అడపాదడపా మాత్రమే జిల్లాకు వచ్చి వెళ్ళే పరిస్థితి వుంటుంది. అదే జిల్లాలోనే మంత్రి వుంటే రెగ్యులర్‌గా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలును పర్యవేక్షించే అవకాశముంటుంది. జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంతో పాటు అమలుకు ప్రయత్నించే వీలుంటుంది. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు జిల్లాస్థాయిలోనే మంత్రిని ఆశ్రయించి పనులు చేసుకునే వెసులుబాటు వుంటుంది. మరో కోణంలో చూస్తే అధికార పార్టీకి కూడా జిల్లాలో నాయకత్వం కరువైన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొందరు ఎమ్మెల్యేలు అమరనాధ రెడ్డిని, మరికొందరు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని ఆశ్రయిస్తున్నారు. నెల్లూరు నుంచీ జిల్లాలో కలసిన గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రి నారాయణను ఆశ్రయించే పరిస్థితి. ఫలితంగా తిరుపతి జిల్లాకంటూ ఓ అధికార కేంద్రం లేకుండా పోయింది. అధికార పార్టీకి కూడా తగిన నాయకత్వం అందుబాటులో లేకుండా పోతోంది.
బదిలీలు, నియామకాలు కొలిక్కి వస్తేనే...
గత మార్చి 16న ఎన్నికల షెడ్యూలు వెలువడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. మే 13న పోలింగ్ జరగగా ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మేరకు మార్చి నుంచీ జిల్లాలో ప్రభుత్వ పాలన మందగించింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారితే జిల్లాస్థాయి నుంచీ మండలస్థాయి వరకూ అధికార యంత్రాంగం బదిలీలకు లోను కావడం సర్వ సాధారణంగా జరిగేదే. దానికనుగుణంగా ఇపుడు జిల్లాలో కూడా కలెక్టర్, ఎస్పీలు మొదలుకుని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలు జరగనున్నాయి. సీఎం ఇష్టాయిష్టాల మేరకు కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తదితరుల నియామకం జరుగుతుంది. ఇక మిగిలిన జిల్లా, డివిజన్ స్థాయి అధికారుల నియామకం జిల్లాలో ఎమ్మెల్యేల సిఫారసు మేరకు జరగనుంది. అదే విధంగా ఎన్నికల ముందు బదిలీపై వచ్చిన డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, తహసిల్దార్లు, సీఐలు, ఎస్‌ఐలు తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీపై వెళ్ళనున్నారు. ఆయా స్థానాల్లోకి కొత్త అధికారులు రానున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లదీ అదే పరిస్థితి. వీరిలో ఎవరు జిల్లాలోనే కొనసాగుతారో ఎవరు బదిలీపై వెళతారో ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి టీటీడీకి మాత్రమే రెగ్యులర్ ఈవో నియమితులయ్యారు. నెలాఖరుకు గానీ ఈ బదిలీలు, నియామకాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. అవన్నీ పూర్తయ్యాక గానీ జిల్లాలో పాలన పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు.