జిల్లా పదవుల భర్తీ ఎన్నడో..?
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:34 AM
రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల్ని రెండు విడతల్లో భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఇంకా దృష్టి సారించలేదు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైపోయినా ఇంకా ఆ ప్రస్తావన లేకపోవడంతో పదవులు ఆశించినవారు కాస్త అసంతృప్తిలో ఉన్నారు.
ఖాళీగా పది మార్కెట్ కమిటీలు
ఆరు నెలలుగా ఆలయ కమిటీలూ ఖాళీగానే
తాజాగా డీసీసీబీ, డీసీఎంఎ్‌సల
పర్శన్ ఇన్‌చార్జిల పొడిగింపు
చిత్తూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల్ని రెండు విడతల్లో భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఇంకా దృష్టి సారించలేదు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైపోయినా ఇంకా ఆ ప్రస్తావన లేకపోవడంతో పదవులు ఆశించినవారు కాస్త అసంతృప్తిలో ఉన్నారు.
ఆ రెండు పదవులకు మరో ఆరునెలలు
ఫ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఉమ్మడి జిల్లా వారీగా పనిచేస్తున్నాయి. వైసీపీ హయాంలో ఈ రెండింటికి ఆ పార్టీ నాయకుల్ని నామినేట్ చేశారు. కూటమి వచ్చాక చిత్తూరు జాయింట్ కలెక్టర్‌ను పర్శన్ ఇన్‌చార్జిగా నియమించారు. డీసీఎంఎ్‌సకు, డీసీసీబీకి పర్శన్ ఇన్‌చార్జి పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చేసింది. దీంతో ఆశలు పెట్టుకున్న కూటమి నాయకులు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.
ఫ జిల్లా కేంద్రంలోని చుడా చైర్మన్ పోస్టును ఆ మధ్య కటారి హేమలతకు ఇచ్చారు. ఇటీవల సాగునీటి సంఘం ఎన్నికల్ని జరిపించగా.. సుమారు 216 సంఘాలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు నియామకమయ్యారు. కానీ, ఈ సాగునీటి సంఘాల పదవులు చెప్పుకోదగినవి కావు. జిల్లా గ్రంథాలయ సంస్థ, కోఆపరేటివ్ ప్రింటింగ్ ప్రెస్, టౌన్ బ్యాంకు చైర్మన్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దగ్గర్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ఫ జిల్లాలో పది మార్కెట్ కమిటీలున్నాయి. ఈ పదవులకు ఎన్నికల్లో కష్టపడిన నాయకులు ఆశిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లను చేతపట్టుకుని తిరుగుతున్నారు. తాజాగా మార్కెట్ కమిటీల నియామకానికి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ మన జిల్లాలో పూర్తయ్యాక ఆ తర్వాత భర్తీ గురించి ఆలోచిస్తారు.
ఫ సుప్రసిద్ధ కాణిపాక ఆలయం, ప్రముఖ బోయకొండ గంగమ్మ ఆలయాలతో అర్ధగిరి, వేపంజేరి వంటి మరిన్ని చెప్పుకోదగ్గ ఆలయాలు జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటికీ పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సమయంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆశావహులు భావించినా అది సాధ్యమవ్వలేదు.