స్విమ్స్ డైరెక్టర్ ఎవరు?
ABN , Publish Date - Aug 07 , 2024 | 02:42 AM
టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్‌గా ఎవరు రాబోతున్నారు అనే చర్చ వైద్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పదవీకాలం రెండేళ్లపాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం మారడంతో ఈయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
తిరుపతి, ఆంధ్రజ్యోతి
టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్‌గా ఎవరు రాబోతున్నారు అనే చర్చ వైద్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పదవీకాలం రెండేళ్లపాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం మారడంతో ఈయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రాజకీయ నాయకులతో సఖ్యతగా ఉండే రవికుమార్, టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం మారగానే మొదలు పెట్టారని అంటున్నారు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కార్డియోథొరాసిక్ సర్జన్‌గా పనిచేస్తున్న ఆర్వీ కుమార్‌ను వైసీపీ ప్రభుత్వంలో స్విమ్స్ డీమ్డ్ వర్సిటీ వైస్ చాన్సలర్ కమ్ డైరెక్టర్‌గా ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు అప్పగించారు. స్విమ్స్‌లో ఉన్న సీనియర్లను పట్టించుకోకుండా ఈయన్ను తీసుకురావడంపై అప్పట్లో వైద్యవర్గాలో చర్చ జరిగింది కూడా. అయితే వైసీపీ నాయకులకు ఆగమేఘాలమీద వైద్య సేవలు ఇంటికే అందిస్తూ ఈయన వారి మెప్పు పొందారు. నిజానికి గుండె వైద్య నిపుణుడిగా స్విమ్స్‌లో పేరున్న సీనియర్ డాక్టర్ రాజశేఖర్‌కు వెంగమ్మ తర్వాత డైరెక్టర్ పదవి లభిస్తుందని అందరూ భావించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి బాగా సన్నిహితుడిగా కూడా పేరున్నందున ఈయనకు పదవి లభిస్తుందని అనుకున్నా అప్పటి సీఎం జగన్ పేషీ నుంచి రవికుమార్ పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ డాక్టర్ రాజశేఖర్ పేరు వినిపిస్తోంది. బర్డ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. అయితే ఆయన వయసు రీత్యా సాధ్యం కాదేమో అనే అనుమానాలూ ఉన్నాయి. మరోవైపు మాజీ డైరెక్టర్ వెంగమ్మ పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత అవమానకర రీతిలో ఆమెను పంపేసినందున కూటమి ప్రభుత్వం ఆమె పేరును సానుకూలంగా పరిశీలించవచ్చని కొందరు అంటున్నారు.
ఐఏఎస్‌ను నియమిస్తారా?
ఇలా వుంటే స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి.. ఒక డైరెక్టర్‌ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ఒకవేళ ఈ అంశం తెరపైకి వస్తే ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించే అవకాశాలూ లేకపోలేదు. ఏదిఏమైనా టీటీడీ పాలకమండలి నియామకం జరిగిన తర్వాతే స్విమ్స్ డైరెక్టర్ మార్పులు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాయలసీమకే తలమానికం అయిన స్విమ్స్ సారథ్య బాధ్యతలను రాజకీయ కోణంలోంచి చూసి కాకుండా ప్రతిభావంతులకు అప్పగిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. పేదలకూ మంచి వైద్యం అందుతుంది.