తిరుమల ప్రసాదాల రుచిఎందుకు తగ్గింది?
ABN , Publish Date - Aug 11 , 2024 | 02:14 AM
కొన్నేళ్లుగా తిరుమల ప్రసాదాల రూపూ రుచీ మీద పెదవిరుపులు పెరిగాయి. ‘అబ్బే.. అప్పుడున్న రుచి.. ఇప్పుడెక్కడిది?’ అనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జగనన్న పాలనలో తిరుమల ప్రసాదాలు కూడా నాణ్యతలేకుండా పోయాయనే విమర్శలూ హోరెత్తాయి.
ఆర్గానిక్ ధాన్యం వాడకంపై పునఃసమీక్ష
తిరుమల, ఆంధ్రజ్యోతి: లడ్డూ, చక్కెర పొంగలి, ఉప్పుపొంగలి, దద్దోజనం, క్షీరాన్నం.. ఇలా తిరుమల శ్రీనివాసుడికి సమర్పించే నైవేద్యాలు అనగానే పవిత్ర భావంతోపాటూ నోరూరుతుంది. ఘుమఘుమలు ముక్కులను తాకుతాయి. తిరుమల ప్రసాదాల రుచి ఇంకెక్కడా ఎందుకు రాదా అనే సందేహం కలుగుతుంది. అయితే కొన్నేళ్లుగా ప్రసాదాల రూపూ రుచీ మీద పెదవిరుపులు పెరిగాయి. ‘అబ్బే.. అప్పుడున్న రుచి.. ఇప్పుడెక్కడిది?’ అనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జగనన్న పాలనలో తిరుమల ప్రసాదాలు కూడా నాణ్యతలేకుండా పోయాయనే విమర్శలూ హోరెత్తాయి.
ఎందుకు ఇలా? ఏం జరిగింది?
ప్రసాదాలకు ముడి పదార్థాల వాడకంలో, దిట్టంలో మార్పులు జరిగాయి? నాణ్యమైన పదార్థాలు వాడడం లేదా? లడ్డూ నాణ్యతే కాదు, సైజూ తగ్గిపోయిందనీ,
అన్నప్రసాదాలు తక్కువ వ్యవధిలోనే పాడైపోతున్నాయనీ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వున్నారు.
శ్రీవారి లడ్డూప్రసాదానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ఆలయంలో వితరణ చేసే అన్నప్రసాదాలకూ అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతినిత్యం త్రికార నైవేద్యం పేరుతో శ్రీవారికి రోజుకు మూడు పూటలా నైవేద్య సమర్పించడం ఆనవాయితీ. ఇందులో నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంటగా వ్యవహరిస్తారు. తొలి నివేదన ఉదయం 5.30కు, రెండో నివేదన ఉదయం 10 గంటలకు, రాత్రి నివేదన 7.30 గంటలకు సమర్పిస్తారు. వారపు సేవలను బట్టి నివేదన సమర్పణ సమయం మారుతుంటుంది. స్వామి నివేదించే ప్రసాదాల్లో ప్రధానంగా లడ్డూ, వడ, సీరా, దోశ, ప్రసాదాలతోపాటు చక్కెరపొంగళి, కదంబం, పులిహోర, దద్దోజనం, మిరియాల పొంగలి, సేకరాబాత్, మొలహోరా వంటి అన్నప్రసాదాలూ ఉంటాయి. వీటిని ఆలయంలోని బంగారువాకిలికి ఆగ్నేయదిశగా ఉన్న పోటులో శ్రీవైష్ణవులు పవిత్రంగా ఇప్పటికీ కట్టెల పొయ్యలపైనే తయారుచేస్తున్నారు. ప్రతి ప్రసాదాన్ని ఒక్కో గంగాళంలో తీసుకెళ్లి మూలవర్లకు నివేదించడం గమనార్హం.
రుచి తగ్గడానికి కారణాలేమిటి?
బహురూపి, నారాయణకామిని, రత్నచోళి, కాలాబట్, చింతలూరి సన్నం, చిట్టిముత్యాలు, ఎర్రబంగారం వంటి దేశీయ వరిబియ్యంతోనే అన్నప్రసాదాలను వండుతున్నారు. ఈ అన్నప్రసాదాల రుచిపై తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. మునుపటి అన్నప్రసాదాలతో పోల్చుకుని అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా త్వరగా పాడైపోతున్నాయి కూడా. నిజానికి సేంద్రియ పదార్థాలతో చేసిన వంటల రుచి భిన్నంగా ఉంటుంది. వీటిని వండే పద్ధతి కూడా మారుతుంది. ముడి బియ్యం వాడుతుంటే ఎక్కువ సేపు నానబెట్టడం వంటివి చేయాలి. సేంద్రియ ధాన్యాలతో రకరకాల వంటలు రుచిగా ఎలా చేయవచ్చో అనేక పుస్తకాలు కూడా విడుదలయ్యాయి. ప్రత్యేకంగా రెస్టారెంట్లే నడుస్తున్నాయి. వీటిని ఇష్టపడి మరీ తింటున్నారు. మరి టీటీడీ చేస్తున్న అన్నప్రసాదాలు మాత్రం ఎందుకు రుచిగా లేవన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీఐపీల నుంచి కూడా విమర్శలు పెరగడంతో టీటీడీ అధికారులు పూర్వపు విధానమే అనుసరించాలా అనే చర్చ కూడా చేస్తున్నారు. సాధారణ సన్న బియ్యంతోనే అన్నప్రసాదాలు తయారు చేయాలా లేక గోఆధారిత ఉత్పత్తులతోనే కొనసాగించాలా అనే అంశంపై కొత్తగా పాలక పగ్గాలు చేపట్టిన అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకుసంబంధించిన నిపుణుల సూచనలు కూడా కోరుతున్నారు. మునుపటిలా అందరికీ అందేలా అన్నప్రసాదాల తయారీ పరిమాణం కూడా పెంచాలని భక్తులు కోరుతున్నారు.
కొవిడ్ తర్వాత భక్తులకు దూరమైన ప్రసాదాలు
కొవిడ్ తర్వాత తిరుమలలో స్వామికి సమర్పించే అన్నప్రసాదాల్లో తేడా మొదలైంది. రుచి తగ్గిపోవడంతోపాటూ, తయారు చేసే ప్రసాదాల పరిమాణం తగ్గిపోయింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. గతంలో స్వామి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ బయటకు రాగానే చక్కెర పొంగలో, పులిహారో, దద్దోజనమో దొన్నెలో పెట్టి చేతికిచ్చేవారు. ఇప్పుడు వీఐపీలకు తప్ప అన్నప్రసాదాలు అందడం లేదు. ఇందుకు కారణం - అన్నప్రసాదాల తయారీ బాగా తగ్గించేయడమే. గతంలో స్వామికి నివేదించేందుకు ప్రతిరోజు 29 గంగాళాల అన్నప్రసాదాలు తయారు చేసేవారు. శుక్రవారం అభిషేకం సందర్భంగా 40 గంగాళాలు సమర్పిస్తే, గురువారం తిరుప్పావైసేవకు 29 గంగాళాలకు అదనంగా మరో 40 గంగాళాల అన్నప్రసాదాలను స్వామికి సమర్పించేవారు. దర్శనానంతరం భక్తులకు పంచడానికి వీలుగా రోజూ మరో 60గంగాళాల ప్రసాదాలు చేసేవారు. ఇందువల్ల రోజూ 25-30 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందేవి.
ఇప్పుడు ఇలా...
కొవిడ్ సమయంలో భక్తులు ఉండరు కాబట్టి అదనపు ప్రసాదాల తయారీని తగ్గించి కేవలం స్వామికి మాత్రమే సమర్పిస్తూ వచ్చారు. ఆతర్వాత భక్తుల సంఖ్య నెమ్మదిగా పెరిగినప్పటికీ దీన్నే కొనసాగించేశారు. వాటి పరిమాణం కూడా దారుణంగా తగ్గించేశారు. పైగా ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేసిన అన్నప్రసాదాలనే స్వామికి నివేదించడం మొదలుపెట్టారు. గోఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతోనే గోవిందునికి నైవేద్యం సమర్పించే విధానం 2022 అక్టోబరు నుంచి అమలు అవుతోంది. రోజుకు కేవలం 204 కిలోల దేశీయ బియ్యంతో చేసిన అన్నప్రసాదాలను మాత్రమే స్వామికి ప్రస్తుతం నివేదిస్తున్నారు. దీంతో ఇవి సాధారణ భక్తుల దాకా రావడం లేదు. అధికారులు, వీఐపీలకే సరిపోతున్నాయి.