CM Chandrababu : రంగంలోకి సైన్యం
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:28 AM
బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
బుడమేరు గండ్లు పూడ్చే బాధ్యత అప్పగింత
జగన్ ప్రభుత్వం వాటిని అలాగే వదిలేసింది
ఆ గండ్ల నుంచే విజయవాడకు వరద
రెండు రోజుల్లోనే 40 సెంటీమీటర్ల వర్షం
వాగుకు ఏకంగా 30 వేల క్యూసెక్కుల వరద
15 లక్షల క్యూసెక్కులను తట్టుకొనేలా ‘ప్రకాశం’ను పటిష్ఠపర్చడంపై దృష్టి: చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ నైపుణ్యం జోడించడానికి ఆర్మీ నిపుణులు గురువారం రాత్రి వస్తున్నారని తెలిపారు. ‘బుడమేరు వరదను మళ్లించడానికి మేం గతంలో చేపట్టిన పనులను జగన్ ప్రభుత్వం 2020లో రద్దు చేసింది. ఆ వాగుకు పడిన గండ్లను పూడ్చకుండా వదిలివేసింది. ఆ గండ్ల నుంచి వరద విజయవాడ నగరంపై పడింది. మామూలుగా బుడమేరుకు ఏడెనిమిది వేల క్యూసెక్కుల వరద వచ్చేది. కానీ రెండు రోజుల్లో అతి భారీగా నలభై సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఏకంగా 30 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇంత వర్షం కురవడం మామూలు విషయం కాదు. ఇటువంటి పరిణామాల్ని ఎలా ఎదుర్కోవాలో సాంకేతిక నిపుణులతో మాట్లాడుతున్నాం. ప్రకాశం బ్యారేజీని వందేళ్ల కిందట పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరద తట్టుకొనేలా కట్టారు. ఇప్పుడు దాదాపు అంత వరద వచ్చింది. ఇంకా పెరిగితే ఎలా అన్నదానికి సమాధానం చూడాలి. పదిహేను లక్షల క్యూసెక్కుల వరదను కూడా తట్టుకొనేలా ప్రకాశం బ్యారేజీని ఎలా పటిష్టపర్చాలన్నది చర్చిస్తున్నాం. కృష్ణా నది కట్టలను కూడా బలోపేతం చేయాలి. ఇవన్నీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నాం’ అని వివరించారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్...కేంద్రం నుంచి తగిన సాయం అందేలా చూడగలరని ఆశిస్తున్నామని చెప్పారు.