CM Chandrababu: ఎన్టీఆర్ యుగపురుషుడు
ABN , Publish Date - Dec 15 , 2024 | 05:24 AM
సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన నిజమైన యుగపురుషుడు ఎన్టీఆర్. ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాల్సిందే.
భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తాం
ప్రజల కోసం శేషజీవితాన్ని అంకితం చేశారు
పాలనలో ఎన్నో మార్పులు తెచ్చారు
ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభలో చంద్రబాబు
క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం పట్టుదలే ఆయనకు నివాళి: వెంకయ్య
తారకరామం, సినీప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణ
విజయవాడ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన నిజమైన యుగపురుషుడు ఎన్టీఆర్. ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. అప్పటి వరకు పోరాటం సాగిస్తాం. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే ఆ గౌరవం తెలుగుజాతికే కాదు, దేశానికి దక్కుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ప్రైవేటు రిసార్ట్స్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌పై రూపొందించిన ‘తారకరామం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యుగపురుషులను సమాజం ఎప్పటికీ మరవదన్నారు. దీనికి ఎన్టీఆర్ నిదర్శనమన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తెలుగువారి ఆత్మగౌరవం, అచ్చ తెలుగుదనంగా మారారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో సీఎం కావడం ఒక చరిత్ర. 1945లో మద్రాసుకు రైలు ఎక్కాక ఆయన జైత్రయాత్ర ఆగలేదు. సినీ పరిశ్రమలో ముందుగా జీతానికి ఉద్యోగంలో చేరి తర్వాత వెండితెరను ఏలారు. ప్రస్తుతం మూడేళ్లకు ఒక చిత్రం విడుదలవుతున్న సందర్భంలో ఆయన ఏడాదికి పది చిత్రాల్లో నటించేవారు.
ఎన్టీఆర్ వైవిధ్యమైన పాత్రలను పోషించారు. రాముడు-రావణుడు, కృష్ణుడు-దుర్యోధనుడు ఇలా వైరుధ్య పాత్రలను పోషించినప్పుడు వాటికి ఎలా న్యాయం చేస్తారని పలుమార్లు నేను ప్రశ్నించాను. ఒక్కొక్కరిలో ఒక్కో గుణం ఉంటుందని, దాన్నే తాను చూపిస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారు. సినిమాల్లో అనేక ప్రయోగాలు చేశారు. సినీరంగంలో 24 ఫ్రేమ్‌లను తెలియజేశారు. శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరస్వామి పాత్రలను పోషించాల్సి వచ్చినప్పుడు మాంసాహారం తీసుకునేవారు కాదు. నేలపైనే నిద్రించేవారు. తనను ఆదరించిన ప్రేక్షకుల కోసం ఆయన శేషజీవితాన్ని అంకితం చేశారు. తొమ్మిది నెలల పాటు చైతన్యరథంపై రాష్ట్రమంతా పర్యటించారు. చివరికి పిల్లల పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా ప్రజల మఽధ్య ఉన్నారు. ఆయన సీఎంగా పాలనకు కొత్త అర్థాన్ని ఇచ్చారు. రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఢిల్లీని గజగజలాడించి నేషనల్ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదాన్ని తీసుకొచ్చారు. క్యాపిటలిజం, కమ్యూనిజం.. మీది ఏ ఇజం అన్న విలేకరుల ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా హ్యూమనిజం అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపొందించాం. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది’ అని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ కారణజన్ముడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఎన్టీఆర్ కారణజన్ముడని, వజ్రసంకల్పం కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. గొప్పవాళ్ల చరిత్రను నిక్షిప్తం చేసుకుని నవతరానికి తెలియజేసినప్పుడు ఆ పరంపర కొనసాగుతుందన్నారు. తారకరామం, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాలను చాలా బాగా రూపొందించారన్నారు. ‘ఎన్టీఆర్‌లో క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు నాకు బాగా నచ్చాయి. ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు జీవితంలో ఎవరైనా పైకి వస్తారు. ఈ మూడు లక్షణాలు ఉంటే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ఎన్టీఆర్ విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన చిత్రాల్లోని డైలాగులు, పాటల్లో ఒక సందేశం ఉంటుంది. దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఆయన సలక్షణమైన, విలక్షణమైన పాత్రలు పోషించి నటనా వైదుష్యాన్ని చూపించారు. దుర్యోధనుడ్ని ఆ విధంగా పిలవడం ఇష్టం ఉండదు. అందుకే సుయోధనుడు పదాన్ని ఉపయోగించేవారు. రావణుడు, సుయోధునుడిలో ఉన్న మంచి గుణాలను వెలికి తీసి చిత్రాల ద్వారా ప్రజలకు చూపించారు. రంగులు పూసుకున్నా లేకపోయినా ఆయన అందంగా ఉండేవారు. ఆయన నిజంగానే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. ఎన్టీఆర్ నట విన్యాసం, స్వర విన్యాసం చాలా అద్భుతం. ఆయనను గ్రామాల్లో ప్రజలు ఎన్టీఓడు అని పిలుచుకునేవారు. అనేక పౌరాణిక పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. ఐదు దశాబ్దాల పాటు సినీరంగాన్ని శాసించారు. పురాణ, ఇతిహాసాల్లో ఉన్న అన్ని పాత్రల్లో నటించారు. తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి చూపించారు’ అని వెంకయ్యనాయుడు అన్నారు.