కుటుంబం యూనిట్‌గా పథకాలు!
ABN , Publish Date - Dec 05 , 2024 | 04:01 AM
రాష్ట్రంలో ఒక్కో కుటుంబాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకుని..
పీ-4 ప్రాజెక్టులతో పేదరిక నిర్మూలన సంపన్నుల సాయమూ తీసుకోవాలి: సీఎం
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్కో కుటుంబాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకుని.. ఆ కుటుంబ సభ్యుల ప్రొఫైల్‌కు తగినట్లు ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారమిక్కడ ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్ (4 ‘పీ’) కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందని చెప్పారు. పీ-4 ప్రాజెక్టుకు రాజధాని అమరావతి నిర్మాణం ఉత్తమ ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా ఉండడం, వృద్ధుల సంఖ్య పెరగడం, యువ జనాభా తగ్గిపోవడంతో.. ఒకరిపై ఆధారపడి జీవించే వారి సంఖ్య పెరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
‘ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రమం తప్పకుండా జరగాలి. పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలి. చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం’ అని సీఎం స్పష్టం చేశారు.