CM Chandrababu : పూడికలతోనే బుడమేరు ముంపు
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:23 AM
బుడమేరు ముంపుతో తలెత్తిన భారీ వరదలకు ప్రధాన కారణం ఏంటనే విషయంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకుని విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామంలో ఆకస్మికంగా ఆయన పర్యటించారు.
వరద తగ్గగానే ప్రక్షాళన.. ఇంతకంటే భారీ వరదలు
వచ్చినా ప్రమాదాలు జరగకుండా చేస్తా: చంద్రబాబు
ఎనికేపాడులో ఆకస్మిక పర్యటన.. క్షేత్రస్థాయి పరిశీలన
రైల్వే బ్రిడ్జివద్ద బాబుకు తప్పిన పెనుముప్పు
గుణదల, సెప్టెంబరు 5: బుడమేరు ముంపుతో తలెత్తిన భారీ వరదలకు ప్రధాన కారణం ఏంటనే విషయంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకుని విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామంలో ఆకస్మికంగా ఆయన పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ దాటేందుకు వంతెన లేకపోవడంతో అక్కడే ఉన్న బల్లకట్టపైకి ఎక్కి బుడమేరు కాల్వ వద్దకు చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బుడమేరు నీరు సరిగా పారకపోవడంతోనే వరద ముప్పు వచ్చిందని గుర్తించారు. వరద తీవ్రత తగ్గగానే ఎక్కడికక్కడ బుడమేరు కాల్వ సజావుగా పారేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ దిగువన ఈ తరహాలో బుడమేరు పూడుకుపోయి ఉంటే పైనుంచి వచ్చే నీరు దిగువకు సజావుగా ఎలా పారుతుందని ప్రశ్నించారు. పూడికలు తీసి నీరు పారేలా చేస్తే మరోసారి ఇదే స్థాయిలో కానీ ఇంతకంటే భారీగా కానీ వరద వచ్చినా ఇబ్బందులు ఉండవని.. ముంపు ముప్పు భయం కూడా ఉండదని తేల్చి చెప్పారు. కాగా, సీఎం వచ్చారన్న సమాచారం అందుకున్న ఎనికేపాడు మాజీ సర్పంచ్ కోనేరు శివరామకృష్ణ(పెదబాబు) క్షణాల్లో బల్లకట్ట వద్దకు చేరుకుని పరిస్థితిని చంద్రబాబుకు వివరించారు. అప్పటికే చంద్రబాబు స్థానిక రైతాంగాన్ని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పంటపొలాల్లోకి చేరిన నీరు దిగువకు వెళ్లాలంటే ఏంచేయాలని వారిని ప్రశ్నించారు. దీనికి రైతులు స్పందిస్తూ.. బుడమేరు ఉధృతి తగ్గితే పొలాల్లో నీరు తగ్గుతుందన్నారు. రైతులతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు తిరిగి బల్లకట్టపై ఎక్కి ఏలూరు కాల్వపై ప్రయాణిస్తూ.. మాజీ సర్పంచ్ శివరామకృష్ణతో మాట్లాడారు. బ్రిటీషు హయాంలో బుడమేరు కాల్వకు ఏర్పాటు చేసిన గేట్లను తొలగించి 30 ఏళ్ల క్రితం ఇరిగేషన్ అధికారులు గోడ కట్టేశారని శివరామకృష్ణ చెప్పారు. గత 15 ఏళ్లలో బుడమేరు పూడిక తీసిన దాఖలాలు లేవన్నారు. ఎప్పటికప్పుడు పూడిక తీస్తే విపత్కర పరిస్థితులు వచ్చేవి కావన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు తెలియజేశామని తెలిపారు. బల్లకట్ట స్థానంలో వంతెన నిర్మాణం చేపట్టేందుకు ఆయన హామీ ఇచ్చారన్నారు.