Share News

కర్నూలులో హైకోర్టు బెంచ్‌

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:52 AM

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ప్రజాగళం యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

లోకాయుక్త, హక్కుల కమిషన్‌ కార్యాలయాలు అక్కడే కొనసాగింపు

ఏపీఈఆర్‌సీ ఆఫీసు మాత్రం అమరావతికి

కర్నూలు బెంచ్‌పై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ

సీమలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలపాలని వినతి

ప్రజాగళం హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు

బెంచ్‌ పరిధిలో 8 రాయలసీమ జిల్లాలు.. రాష్ట్ర విస్తీర్ణంలో ఈ ప్రాంతం

43ు పైనే.. 4.95 కోట్ల జనాభాలో 1.59 కోట్ల మంది ఇక్కడివారే

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ప్రజాగళం యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కర్నూలులో బెంచ్‌ ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం బుఽధవారం ఆమోదించింది. దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాలని నిశ్చయించింది. లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. వీటిని అమరావతికి తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయాలని నిశ్చయించిన నేపథ్యంలో లోకాయుక్త, హక్కుల కమిషన్‌ సహా న్యాయ వ్యవస్థకు చెందిన కొన్ని కార్యాలయాలను అక్కడే కొనసాగించాలని కేబినెట్‌ నిశ్చయించింది. అదే సమయంలో పై రెండు కార్యాలయాలను కర్నూలులో కొనసాగించాలని.. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కార్యాలయాన్ని మాత్రం అమరావతికి తరలించాలని నిర్ణయించింది.

విద్యుత్‌ సంస్థల అధికారులతో సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నందువల్ల ఏపీఈఆర్‌సీ కార్యాలయం రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా.. రాయలసీమలోని 8 జిల్లాలను ప్రతిపాదిత కర్నూలు బెంచ్‌ పరిధిలోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. బెంచ్‌ ఏర్పాటుకు అవసరమైన సమాచారం ఇవ్వాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ కూడా రాసింది. సీమ ప్రాంతం పరిధిలో ప్రస్తుతం హైకోర్టులో ఎన్ని కేసులున్నాయో తెలపాలని కోరింది. సివిల్‌, క్రిమినల్‌, రివిజన్లు, రిట్‌ పిటిషన్లు, పారిశ్రామిక, పన్ను వివాదాలతో ముడిపడిన కేసులు, ఇతరత్రా కేసుల సంఖ్యకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే రెండు మూడేళ్లుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు పంపాలని అభ్యర్థించింది. ఒక బెంచ్‌ కొత్తగా ఏర్పాటు చేయాలంటే.. మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు సదరు ప్రాంతం పరిధిలో ఉండాలి. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 32 (3) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం లభిస్తే బెంచ్‌ ఏర్పాటు చేయవచ్చు. గవర్నర్‌ ఆమోదం తర్వాత కేంద్రం, సుప్రీంకోర్టుల ఆమోదం లాంఛనప్రాయమేనంటున్నారు.

అయితే సాధారణంగా హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఏకీభవించాల్సి ఉంటుంది. మొదటి నుంచీ కర్నూలుకు అన్యాయం జరుగుతోందన్న భావన ఆ ప్రాంత వాసుల్లో బలంగా ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు కర్నూలునే రాజధానిగా ప్రకటించారు. అయితే హైదరాబాద్‌ రాష్ట్రం విలీనంతో 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్‌ను రాజధానిని చేయడంతో కర్నూలుకు నిరాశే ఎదురైంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేశారు, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఆనాడే ప్రకటించారు. అయితే జగన్‌ సీఎం అయ్యాక రాజధానిపై మూడు ముక్కలాట ఆడి.. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని మభ్యపెట్టారు. ఏదీ జరక్కపోవడంతో సీమ ప్రజలు ఇలాంటి హామీలు నమ్మలేని స్థితికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటును సాకారం చేయాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. సదరు బెంచ్‌ కోసం స్థలసేకరణ చేసి శాశ్వత భవనాలు నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తూనే.. మరోవైపు పై స్థాయిలో అవసరమైన అనుమతులు తీసుకునేందుకు శ్రీకారం చుట్టారు. 2022లో రాయలసీమలో 8 జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర జనాభా 4.95 కోట్లు కాగా.. సీమలో 1.59 కోట్ల మంది ఉన్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో ఇది 25 శాతం కంటే ఎక్కువ. మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో ఈ ఎనిమిది జిల్లాల విస్తీర్ణం 43 శాతం పైనే.’’

Updated Date - Nov 21 , 2024 | 04:53 AM