Share News

CM Chandrababu : జనంలోకి మనం..

ABN , Publish Date - Nov 21 , 2024 | 05:30 AM

రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

 CM Chandrababu : జనంలోకి మనం..

త్వరలో ప్రజలతో ముఖాముఖి

రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం నుంచి ప్రజలకు సంక్షేమం అందిస్తాం. దీనికి సమయం కావాలి. ఇది అసాధ్యం కాదు. అలా అని రాత్రికి రాత్రే అన్నీ అయిపోవు. అభివృద్ధి, సంక్షేమంలో సవాళ్లు, సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తాం.

- చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం

స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తా

టీడీపీతోనే సంక్షేమం ప్రారంభం

అభివృద్ధితోనే రాష్ట్రానికి సంపద

సంక్షేమానికి సర్కారు ఆదాయం

వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం

అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు

సవాళ్లు, సమస్యలను అధిగమిస్తాం

శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం

సమాజానికి సవాల్‌గా మారితే బహిష్కరణే

కూటమి ప్రభుత్వ పాలనపై చంద్రబాబు

అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. వారి ఆకాంక్షల మేరకు పరిపాలన చేస్తాం. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిద్దాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం శాసనసభలో కూటమి పాలనపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ‘‘రాష్ట్రానికి ప్రజలే ఆస్తి. వారిని బలోపేతం చేస్తే ఏదైనా సాధ్యమే. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తా. ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తా. ఎన్నికల్లో ప్రజాతీర్పులు కొత్తకాదు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ టీడీపీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ వంటివి అప్పట్లో సంచలనం సృష్టించాయి. మొన్న జరిగిన ఎన్నికలు అంతకంటే సంచలనంగా మారాయి. 93 శాతం స్టైక్‌రేట్‌, 57 శాతం ఓట్‌ షేర్‌ వచ్చింది. 46 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రజాతీర్పు ఇంతకుముందు చూడలేదు. ప్రజలు బాధ్యతతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఓటేసి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును గౌరవిస్తూ, ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి. ప్రజల అంచనాలను అందుకునే బాధ్యత మనందరిపై ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏ నేతకూ దక్కని గౌరవం

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సహా విభజిత ఏపీలో ఏ నేతకూ దక్కని గౌరవం నాకు దక్కింది. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రజలు, వారి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ వచ్చా. అందుకే ప్రజలు 4 దశబ్దాలుగా ఆదరిస్తున్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశా. కష్టాలు పడ్డా. అవమానాలను భరించా. చివరికి క్లెమోర్‌ మైన్స్‌ పేల్చినా వేంకటేశ్వరస్వామి దయతో బయటపడ్డా. అధికారం నాకు కొత్తేమీ కాదు. 2024లో సీఎం అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి చూసి బాధ కలుగుతోంది. ఎంత తవ్వితే అన్ని అవకతవకలు, భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి’’

పెండింగ్‌ బిల్లులు పెద్ద సవాల్‌

‘‘వైసీపీది విధ్వంసక పాలన. గాడితప్పిన యంత్రాంగం, అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు మా ప్రభుత్వానికి సవాల్‌గా మరాయి. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నేను, పవన్‌, ప్రధాని మోదీ కలిసి చర్చించాం. కేంద్ర నుంచి పూర్తి సహకారం ఉంటుంది. విభజన తర్వాత ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్తున్నాం. రాత్రికి రాత్రి ఏదీ సాధ్యం కాదు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పులున్నాయని సాఽక్ష్యాధారాలతో సహా బయటపెట్టాం. పెండింగ్‌ బిల్లులు పెద్ద సవాల్‌గా మారాయి. మాకున్న అనుభవంతో వీటిని సెట్‌ చేశాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా పాలన కొనసాగిస్తాం’’


ఆ రాష్ట్రాల్లోనూ ఇవ్వని విధంగా

‘‘టీడీపీతోనే సంక్షేమం ప్రారంభమైంది. ‘కూడు-గూడు-గుడ్డ’ నినాదంతో నాడు రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఈ పథకం దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఆహార భద్రత పెంచాం. పేదవారికి అండగా ఉండాలనే సంకల్పంతో రూ.30 పింఛన్‌ను ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని రూ.4 వేలు చేశాం. 2014లో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రంలో పాలన ప్రారంభించాం. లోటు బడ్జెట్‌లో కూడా 120 సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రస్తుతం పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచాం. ఏపీ కంటే సంపద ఎక్కువ ఉన్న రాష్ర్టాలు కూడా ఇవ్వనంత ఎక్కువ మొత్తంలో ఇస్తున్నాం. దేశంలో ఏపీ తర్వాత హరియాణా మాత్రమే రూ.2,500 పెన్షన్‌ ఇస్తోంది. పేదల కోసం 189 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. అన్న క్యాంటీన్లను ఇప్పటి వరకు 1.18 లక్షల మంది ఉపయోగించుకున్నారు. పది మందికి అన్నదానం చేయాలని భావించే వారు అన్న క్యాంటీన్ల ద్వారా ఆ సేవ చేయాలి’’

అమ్మపడ్డ కష్టాలు చూసి!

‘‘ఉమ్మడి ఏపీలో దీపం పథకం ప్రవేశపెట్టాం. మా అమ్మ పడ్డ కష్టాలను చూసిన తర్వాత ఏ ఆడబిడ్డా అలాంటి కష్టం పడకూడదనే ఉద్దేశంతో ‘దీపం పథకం’ ప్రారంభించాం. ఇప్పుడు దీపం-2 పేరుతో ప్రతి ఇంటికీ మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. కేవలం రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉంటే సరిపోతుంది. గ్యాస్‌ సిలిండర్‌కు డబ్బులు చెల్లించిన 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు పడతాయి. 42 లక్షల మందికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సంపద సృష్టించే పనిలో ఉన్నాం. అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. డిసెంబరు నుంచి పనులు ప్రారంభిస్తాం. పోలవరం గేమ్‌ చేంజర్‌. కేంద్రం రూ.12 వేల కోట్లు కేటాయించింది. ప్రాజెక్టును 45.72 మీటర్ల మేరకు నిర్మా ణం చేపడతాం. పంచాయతీరాజ్‌ శాఖకు రూ.990 కోట్లు ఇచ్చాం. మరో రూ.1200 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 16 వేల గ్రామసభలు ఒకేరోజు నిర్వహించాం. రూ.4500 కోట్ల పనులకు అంచనాలు తీసుకుని, 30 వేల పనులకు శ్రీకారం చుట్టాం. జనవరి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆర్‌అండ్‌బీ రోడ్లను కూడా బాగు చేయిస్తున్నాం. రూ.860 కోట్లతో సంక్రాంతి నాటికి గుంతలు మొత్తం పూడ్చే విధంగా పనులు ప్రారంభించాం’’


లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం

‘‘మేం అధికారంలో ఉన్నప్పుడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 4 లక్షల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయింది. ప్రతిసారీ నేను సీఎం అవగానే లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చి లక్షల ఎకరాలకు నీరిస్తుంటే, తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో మోటార్లు పోవడం, దొంగతనాలు జరగడంతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఇబ్బందుల్లో పడుతోంది. ఎన్డీయే ప్రభుత్వం ‘జాబ్‌ ఫస్ట్‌’ అనే హామీకి కట్టుబడి ఉంది. అందుకే అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశా. రాష్ట్రంలో రూ.378 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 3.75 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం’’

అలాంటివారి తాట తీస్తాం

‘‘గత ప్రభుత్వం పోలీస్‌ శాఖను నిర్వీర్యం చేసింది. రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి, నాయకుల్ని అణగదొక్కే విధంగా టార్గెట్‌ చేశారు. ఆడబిడ్డపై హత్యాచారం నీచం. ఇవి చూస్తే చాలా బాధేస్తోంది. గంజాయి నివారణకు డ్రోన్స్‌ పెట్టాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగాహన తీసుకురావాలి. తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేట్‌ చేయాలి. రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్తులను హెచ్చరిస్తున్నా. మీరు ఉండాల్సిన ప్రదేశం ఏపీ కాదు. సమాజానికి సవాల్‌గా మారితే తాట తీస్తాం. గత ప్రభుత్వం మద్యంలో దోపిడీ చేసింది. హోల్‌సేల్‌, రిటైల్‌, తయారీ వ్యవస్థలను అస్తవ్యస్థం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పారదర్శకత తీసుకువచ్చాం. బెల్ట్‌ షాపులు పెడితే ఖబడ్దార్‌. బెల్ట్‌ తీస్తాం. ఎమ్మెల్యేలు బెల్ట్‌ షాపులు లేకుండా చూసుకోవాలి. టెక్నాలజీ సాయంతో వాట్సాప్‌ గవర్నమెంట్‌ తీసుకువచ్చాం. ఈ సభలోనే విజన్‌-2047ను ప్రవేశపెడతాం. కొత్తగా పీ-4 ద్వారా సంపద సృష్టిస్తాం. పీ-4 ద్వారా పబ్లిక్‌, ప్రైవేటు, పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ ద్వారా పేదలను సమానంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాం’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

‘‘గత నాలుగేళ్లలో ఇక్కడే(అసెంబ్లీ) నా కుటుంబ సభ్యుల్ని అవమానించారు. బాధ, ఆవేదనతో కుమిలిపో యా. చివరికి జైలుకు కూడా పంపించారు. కానీ, నేను ఏ తప్పూ చేయలేదు. అనుక్షణం ప్రజల కోసం పని చేశా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనోధైర్యాన్ని పెంచుకుని ప్రజల రుణం తీర్చుకునే ఆలోచన చేస్తున్నా. మళ్లీ నాలుగోసారి సీఎం అయ్యా’’

‘‘అవినీతి, డబ్బులు, కులం, మతం, ప్రాంతం, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో.. ప్రజలు నాపై ఇంత నమ్మకం పెట్టుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను’’

- అసెంబ్లీలో చంద్రబాబు


ఇదీ ఇప్పటి అభివృద్ధి

‘‘వైసీపీ హయాంలో తెచ్చిన చెత్తపన్ను రద్దు చేశాం. మత్స్యకారులకు ఇబ్బందిగా మారిన జీవో 217ను రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్‌ పెట్టాం. గీత కార్మికుల కోసం మద్యం దుకాణాల్లో 10 శాతం షాపులు కేటాయించాం. అర్చకుల జీతాలు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచాం. నాయిబ్రాహ్మణుల వేతనాలు రూ.15 వేల నుంచి రూ.25 వేలు చేశాం. ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం రూ.10 వేలు ఇస్తున్నాం. చేనేతపై జీఎస్టీ ఎత్తేశాం. రైతులకు రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించాం. పంట సేకరించిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం. యాంటీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తీసుకువస్తున్నాం. ప్రైవేటు, ప్రభుత్వ భూముల జోలికి వచ్చే కబ్జాదారులను వదిలి పెట్టం’’

- ముఖ్యమంత్రి చంద్రబాబు

Updated Date - Nov 21 , 2024 | 05:53 AM