Share News

CM Chandrababu : ఇది పెను విపత్తు

ABN , Publish Date - Sep 13 , 2024 | 02:44 AM

రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను సాధారణ విపత్తుగా పరిగణించరాదని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

CM Chandrababu : ఇది పెను విపత్తు

  • సాధారణ విపత్తులా దీనిని చూడొద్దు.. గతంలో వచ్చిన వరదల్లాంటిది కాదిది

  • ఊహించని దెబ్బతో భారీగా నష్టపోయాం

  • కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి

  • బాధితులను తిరిగి నిలబెట్టేలా సాయం

  • రాష్ట్రంలో అపారంగా పంట, ఆస్తి నష్టం

  • రెండు రోజుల్లో 50 సెం.మీ. వర్షపాతం

  • బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద

  • 14 లక్షల క్యూసెక్కులు వస్తే పరిస్థితి ఏంటి?

  • వరదల నుంచి రాష్ట్రానికి శాశ్వత విముక్తి

  • కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు వినతి

  • ఇంత కష్టంలోనూ బాఽధితుల్లో మీపై నమ్మకం

  • సాయం, న్యాయం దక్కుతాయనే ధీమా

  • వారిలో చూశాం.. సీఎంకు బృందం ప్రశంస

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను సాధారణ విపత్తుగా పరిగణించరాదని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గతంలో వచ్చిన సాధారణ వరదల్లా వీటిని చూడొద్దని కోరారు. వరదల నుంచి రాష్ట్రానికి శాశ్వత విముక్తి లభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విన్నవించారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో రెండు రోజులుగా పర్యటిస్తున్న కేంద్ర బృందం గురువారం తనను కలిసినప్పుడు ఆయన ఇలా స్పందించారు.

వరదలు, భారీ వర్షాలు పంట నష్టంతోపాటు ఆస్తి నష్టాన్ని మిగిల్చాయని ఆయన కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. ఊహించని విపత్తుతో ప్రజలు భారీగా నష్టపోయారని, బాధిత ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్ర సాయం ఉండేలా చూడాలన్నారు. అమరావతి సచివాలయంలో ఆయనను కలిసిన కేంద్ర బృందం.. వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. తమ పర్యటనలో రెండు రోజులుగా గమనించిన అంశాలను ముఖ్యమంత్రితో ఈ బృందం పంచుకుంది.

రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందిని ఎందుకు సాధారణ విపత్తుగా చూడరాదో కేంద్ర బృందానికి చంద్రబాబు వివరించారు. ‘‘ఏపీలో రికార్డుస్థాయిలో భారీవర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు తినడానికి తిండి, తాగటానికి నీళ్లు లేక ముంపుప్రాంత ప్రజలు తీవ్ర క్షోభ అనుభవించారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప, వారు తిరిగి కోలుకోలేరు. అందుకే సాధారణ విపత్తులా దీన్ని చూడొద్దని కోరుతున్నా. అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను తిరిగి నిలబెట్టేందుకు కేంద్రం ఉదారంగా సాయం చేసి, ఆదుకునేలా చూడాలి’’ అని వివరించారు.


  • బ్యారేజీకి ఇంత వరద గతంలో రాలేదు..

ప్రకాశం బ్యారేజ్‌ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదని, 11.43లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని కేంద్ర బృందానికి చంద్రబాబు వివరించారు. ఇదే ఇప్పటి వరకు రికార్డు స్థాయి వరద అని వివరించారు. కృష్ణానదికి 14లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే.. పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాల్సిన అవసరముందని తెలిపారు. రెండురోజుల వ్యవధిలో 50సెంటీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. ‘‘వరదల్లో ప్రజలు పడిన బాధలు చూసి చలించిపోయాం.

సీఎం నుంచి చిన్న ఉద్యోగి వరకు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను యుద్ధంలా చేపట్టాం. మంత్రులు, అధికారులు అంతా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేశారు. కలెక్టరేట్‌ను సచివాలయంలా చేసుకుని పని చేశాం. అప్పటికప్పుడు డ్రోన్లు తెప్పించి, ఆహారం సరఫరా చేశాం. కేంద్రం సాయం తీసుకున్నాం. సర్వశక్తులూ ఒడ్డాం. ఫైరింజన్లుతో రోడ్లు, ఇళ్లు క్లీన్‌ చేశాం. రోడ్లు, ఇరిగేషన్‌ వ్యవస్థకు నష్టం జరిగింది. నష్టపోయిన కౌలురైతులకు సాయం అందేలా చూడాల్సిన అవసరముంది’’ అని కేంద్రబృందానికి పరిస్థితిని ముఖ్యమంత్రి వివరించారు.

Untitled-1 copy.jpg


  • ప్రభుత్వ చర్యలతో సాంత్వన: కేంద్రబృందం

వరద ప్రాంతాల్లో తమ అనుభవాలను కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం వివరించారు. ‘‘ఇంత స్థాయి వరదలు.. బాధల అనంతరం కూడా ప్రజలు....ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ చర్యలు వారికి సాంత్వన చేకూర్చాయి. ఇంత కష్టంలోనూ ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహం కనిపించలేదు. తమకు ప్రభుత్వం సాయం చేసిందని, న్యాయం చేస్తుందనే నమ్మకం వారిలో ఉంది. భారీగా పంట నష్టం, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని తెలిసింది. బుడమేరు వరదలపై ప్రజలు బాధలు చెప్పుకొన్నారు. 60ఏళ్ల తర్వాత ఇలాంటి వరదలు వచ్చాయని చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, తగు సాయానికి ప్రయత్నం చేస్తాం అని అన్నారు.


  • బురద శుభ్రానికి ఫైరింజన్ల ఆలోచన అద్భుతం

వరద ముంపు ప్రాంతాల్లో వీధులు, కాలనీలు, ఇళ్లలో బురదను శుభ్రం చేయడానికి ఫైరింజన్లు ఉపయోగించాలనే ఆలోచన అద్భుతమని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. గురువారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబుతో బృందం ప్రతినిధులు భేటీ అయ్యారు. కేంద్ర బృందంలో రమేష్‌ చంద్ర, రామకృష్ణ, ఎం.రాజేంద్రప్రసాద్‌, స్మితా సింఘాల్‌, సత్యనారాయణ్‌, వీ.గైకీ తదితరులు ఉన్నారు.

‘‘రికార్డుస్థాయిలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు తినడానికి తిండి, తాగటానికి నీళ్లు లేక ముంపుప్రాంత ప్రజలు తీవ్ర క్షోభ అనుభవించారు. సర్వం కోల్పోయి, కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప, వారు తిరిగి కోలుకోలేరు. అందుకే సాధారణ విపత్తులా దీన్ని చూడొద్దని కోరుతున్నా. అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను తిరిగి నిలబెట్టేందుకు కేంద్రం ఉదారంగా సాయం చేసి, ఆదుకునేలా చూడండి’’

- కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు


  • నష్టం- కష్టం..

  1. దెబ్బతిన్న ఇరిగేషన్‌ ఆస్తులు 730 కోట్లు

  2. ఎన్టీఆర్‌ జిల్లాలో బాధిత రైతులు 49,342

  3. ఉద్యానశాఖకు నష్టం 5,227 హెక్టార్టు

  4. ఆయిల్‌పామ్‌కు నష్టం రూ 21.73 కోట్లు

  5. పశు సంవర్ధకశాఖకు నష్టం 69.41 లక్షలు

  6. కృష్ణానదికి రికార్డు స్థాయి వరద వల్ల చేపట్టాల్సిన పునరుద్ధరణ పనుల అంచనా 635 కోట్ల ఖర్చు

  7. బుడమేరు గండ్లు 36.98 కోట్లు

  8. మున్నేరు నష్టం 53.27 కోట్లు

  9. దెబ్బతిన్న రహదారులు 690 కిలోమీటర్లు

  10. రోడ్ల పునరుద్ధరణ అంచనా రూ.189 కోట్లు

  11. తాగునీటి పథకాలకు నష్టం 114 కోట్లు

Updated Date - Sep 13 , 2024 | 02:46 AM