Share News

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత

ABN , Publish Date - Nov 17 , 2024 | 04:57 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు.

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత

14న గుండె సంబంధ సమస్యతో ఆస్పత్రికి.. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస

విషయం తెలిసి హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

తమ్ముడి పార్థివదేహానికి నివాళులు.. నేడు నారావారిపల్లిలో అంత్యక్రియలు

తిరుపతి/రాయదుర్గం/అమరావతి/న్యూఢిల్లీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యాధునిక చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, మధ్యాహ్నం 12.45గంటలకు కార్డియాక్‌ అరెస్టుతో తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య ఇందిర, కుమారులు గిరీశ్‌, రోహిత్‌ ఉన్నారు. వీరిలో రోహిత్‌ సినీనటుడు కాగా, గిరీశ్‌ గల్ఫ్‌లో వ్యాపారం చేస్తున్నారు. సోదరుడి ఆరోగ్యం విషమించిన వార్త తెలియగానే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. తమ్ముడి పార్ధివదేహానికి నివాళులర్పించి, ఆయన కుమారులు రోహిత్‌, గిరీశ్‌ను ఓదార్చారు. రామ్మూర్తినాయుడు భౌతికకాయం ఆదివారం ఉదయం 8 గంటలకు విమానంలో రేణిగుంటకు చేరుకోనుంది. అక్కడి నుంచి 9గంటలకు స్వస్థలమైన చంద్రగిరి మండలం నారావారిపల్లికి తరలించనున్నారు. నారావారిపల్లిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు నారా, నందమూరి కుటుంబీకులు హాజరు కానున్నారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ నుంచి సైతం పలువురు నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.

కాణిపాకం ఆలయ అభివృద్ధికి కృషి

కాణిపాకం వినాయక ఆలయం నేడు ఈ స్థాయిలో ప్రాచుర్యంతో పాటు అభివృద్ధి చెందడానికి బీజం వేసింది రామ్మూర్తినాయుడే. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన 1994-99 మధ్య ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆలయ విస్తరణకు మాస్టర్‌ ప్లాన్‌ స్వయంగా రూపొందించారు. రైతులను ఒప్పించి వారి భూములను సేకరించి ఆలయాన్ని విశాలంగా విస్తరించారు. చిత్తూరు- ఐరాల రోడ్డులోని అగరంపల్లి వద్ద ప్రధాన స్వాగత తోరణ నిర్మాణం, అక్కడి నుంచీ కాణిపాకానికి రోడ్డు విస్తరించి డివైడర్లతో కూడిన డబుల్‌ రోడ్డు నిర్మాణం వంటివి ఆయన చొరవ వల్ల జరిగినవే. ఆలయంలో ఆర్జిత సేవలనూ మెరుగుపరిచి భక్తులు పెరిగేందుకు కారకులయ్యారు.

బాబుకు రాహుల్‌గాంధీ పరామర్శ

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సీఎం చంద్రబాబును ఫోన్‌లో పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సంతాపం

రామ్మూర్తినాయుడు మరణం టీడీపీకి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విశేష సేవలందించారని గుర్తు చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి, అనిత, నారాయణ, సత్యప్రసాద్‌, జనార్దన్‌రెడ్డి, బాలవీరాంజనేయస్వామి, సవిత, దుర్గేశ్‌, రాంప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కోండ్రు మురళి, జయనాగేశ్వర్‌రెడ్డి, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు సంతాపాన్ని తెలియజేశారు. కాగా, శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామ్మూర్తినాయుడు మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

dfub.jpg

పదిహేనేళ్లుగా అనారోగ్యంతో..

2004 ఎన్నికల అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించింది. అల్జీమర్స్‌ లక్షణాలతో కుటుంబసభ్యులు సహా పరిచయస్తులను గుర్తించలేకపోయేవారు. చంద్రబాబు చొరవ తీసుకుని కేరళలో ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్యం కూడా ఇప్పించారు. పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబీకులు ఆయన్ను గత పదిహేనేళ్ల నుంచీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. అనారోగ్యానికి వయోభారం తోడవడంతో సమస్యలు పెరిగాయి. గత ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు.


రాజకీయ నేపథ్యం

తొలినాళ్లలో అన్న చంద్రబాబు వెన్నంటి నడుస్తూ రాజకీయంగా తోడునీడగా నిలిచిన రామ్మూర్తినాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్‌ పొంది కాంగ్రెస్‌ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై 16వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. 1999లో వర్గ రాజకీయాలతో ముఖ్య నేతలు సహాయ నిరాకరణ చేయడంతో ఓటమి పాలయ్యారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో 2003లో టీడీపీ వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే చంద్రగిరి అసెంబ్లీ టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ పెద్దలు మొండిచేయి చూపడంతో 2004 ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే టీడీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. రామ్మూర్తినాయుడు ఓట్లు చీల్చడం వల్లే కాంగ్రెస్‌ అభ్యర్థి గల్లా అరుణకుమారి సునాయాసంగా విజయం సాధించారు.

చిన్నాన్న మరణం బాధాకరం: మంత్రి లోకేశ్‌

చిన్నాన్న నారా రామ్మూర్తినాయుడు మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. చిన్నాన్నతో చిన్ననాటి తన అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులర్పిస్తున్నానని ‘ఎక్స్‌’లో సంతాప సందేశం పోస్టు చేశారు. ‘మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం.. నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని ధైర్యంగా ఉండాలని కోరుతున్నా’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి: పవన్‌

సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి చేకూరాలని భవవంతుడిని ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉన్నందున అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు.

టీ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి

మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తినాయుడు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు. రామ్మూర్తినాయుడి భౌతికకాయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. రామ్మూర్తినాయుడు కుటంబసభ్యులకు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - Nov 17 , 2024 | 05:22 AM