Sri Sathya Sai: బత్తలపల్లి తహసీల్దార్ సస్పెండ్.. కలెక్టర్ ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Jan 24 , 2024 | 09:22 PM
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలం బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టారని యోగేశ్వరి దేవిపై ఇదివరకే ఆరోపణలు వచ్చాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలం బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టారని యోగేశ్వరి దేవిపై ఇదివరకే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేసిన అనంతరం.. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ప్రభుత్వం భూ పంపిణీ పేరుతో పేదలకు 11 గ్రామాల్లో 411 ఎకరాల భూమి ఇచ్చింది. అయితే.. ఆ భూముల్లో సాగు లేకపోవడం, ఇతరులకు విక్రయించడం వంటి కారణాల వల్ల కొందరి నుంచి ఆ భూముల్ని వెనక్కు తీసుకుంది. ఇదే అదునుగా.. వైసీపీ నాయకులు ఆ భూములపై కన్నేశారు. ఆ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు.. యోగేశ్వరి దేవితో కలిసి ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వ భూముల్లో 190 మందికి సాగుపట్టాలు ఇవ్వాలంటూ కలెక్టర్‌కు తహసీల్దార్ ప్రతిపాదనలు పంపారు.
అయితే.. సర్వే నంబర్లలో చాలావరకు గతంలో పేదలకు కేటాయించిన భూములే ఉన్నాయని కలెక్టర్ అరుణ్ బాబు గుర్తించారు. దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని యోగేశ్వరి దేవికి ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తర్వాత తాజాగా ఆమెని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అత్యాశకు పోయి అవినీతికి పాల్పడితే, పరిణామాలు ఇలాగే ఉంటాయని ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.