Visakhapatnam: అవినీతి వైసీపీ నేతలు జైలుకే.. మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ABN , Publish Date - Apr 25 , 2024 | 05:53 AM
ఈసారి కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాగానే వైసీపీ అవినీతి నాయకులను జైలుకు పంపిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఈసారి ఎన్డీయే ప్రభుత్వం రాగానే చేస్తాం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
విశాఖపట్నం/అనకాపల్లి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఈసారి కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాగానే వైసీపీ అవినీతి నాయకులను జైలుకు పంపిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరించారు. జగన్ పాలనలో విశాఖపట్నం డ్రగ్స్, ల్యాండ్ మాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. బుధవారం విశాఖ గ్రాండ్ బే హోటల్‌లో నిర్వహించిన మేధావుల సమావేశంలోనూ, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన విజయీభవ ర్యాలీలోనూ రాజ్‌నాథ్ మాట్లాడారు.
విశాఖలో ల్యాండ్ మాఫియాపై, ఏపీలో ఇసుక మాఫియాపై కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉందని రాజ్‌నాథ్ చెప్పారు. కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఏపీలో వివిధ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే వాటిని కూడా జగన్ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
ఈ నిధులన్నీ చాలవన్నట్టు జగన్ ప్రభుత్వం రూ.13.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఏపీలో ప్రతి పౌరుడి తలపై రూ.2 లక్షల అప్పు ఉందని వివరించారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, భూ ఆక్రమణలు, ఇసుక దందా చాలా తీవ్రస్థాయిలో ఉన్నాయని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలో ఈసారి ఎన్డీయే ప్రభుత్వం రాగానే ఆంధ్రాలో అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులందరినీ జైలుకు పంపుతామని తేల్చిచెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.