Share News

Amaravati : 33కి చేరిన మృతులు

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:28 AM

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 33కు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లాలోనే 25 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

Amaravati : 33కి చేరిన మృతులు

  • ఎన్టీఆర్‌ జిల్లాలోనే 25 మంది.. 275 పశువులు, 59,975 కోళ్లు మృతి

  • వరదలకు 3,756 కి.మీ. ఆర్‌అండ్‌బీ రోడ్లు

  • 348 కి.మీ. పంచాయతీ రోడ్లు ధ్వంసం

అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 33కు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లాలోనే 25 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు 3,756 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్నాయని తేలింది. పంచాయతీరాజ్‌ రోడ్లు 348 కిమీ దెబ్బతిన్నాయి. విజయవాడతో సహా వివిధ పట్టణాల్లో 533.57 కిమీ రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. 33 మంచినీటి పథకాలు దెబ్బతిన్నాయి. 1,69,370 హెక్టార్లలో వ్యవసాయ, 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. 46.22 హెక్టార్ల ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. 275 పశువులు, 59,975 కోళ్లు మృత్యువాతపడ్డాయి. 403 మత్స్యకార బోట్లు పూర్తిగా, 26 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 414 వలలు పాడైపోయాయి.

వరదల కారణంగా గత ఐదురోజుల్లో విజయవాడలో 339 రైళ్లు రద్దు కాగా, 181 రైళ్లను దారి మళ్లించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడ సహా ఎన్టీఆర్‌, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో 214 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయగా, 45,369 మంది పునరావాసం పొందుతున్నారు. 158 వైద్యశిబిరాల్లో సేవలు అందిస్తున్నారు. 344 మంది గర్భిణులను వైద్యశాలలకు తరలించారు. 50 ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నేవీ బృందాలు, ఆరు హెలికాప్టర్లు, 228 బోట్లతో పాటు 315 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కంట్రోల్‌ రూమ్‌లు, స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్‌కు అధికారులు స్పందించి బాధితులకు సహాయం అందించారు. ముంపులో ఉన్న కుటుంబాలకు పాలు, అల్పాహారం, భోజనం, బిస్కెట్లు వంటివి అందజేస్తున్నారు. విజయవాడలో ఫైరింజన్లతో ఇళ్ల ముందు బురదను శుభ్రం చేస్తున్నారు. పాడైన వాటర్‌ పైపులైన్లకు రిపేర్లు చేస్తున్నారు. ట్యాంకులు, కాలువలు, వాగులకు పడిన గండ్లును పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - Sep 06 , 2024 | 05:28 AM