Excise employees : జీరో సర్వీసు బదిలీలే!
ABN , Publish Date - Sep 13 , 2024 | 05:24 AM
ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొందరు అధికారులు ఉన్న చోటే తిష్ఠ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎక్సైజ్ ఉద్యోగుల డిమాండ్..తమను కదిలించొద్దంటూ కొందరి ఒత్తిళ్లు
అధికారుల సంఘం పేరుతో చక్రం తిప్పుతున్న వైనం
వాసుదేవరెడ్డితో అంటకాగి మంచి స్థానాల్లో తిష్ఠ
ఇప్పుడూ ఆ స్థానాలు వీడేందుకు ససేమిరా!.. సెబ్ ఏర్పాటు సమయంలో అందరూ బదిలీ
తాజాగా పునర్నిర్మాణంలోనూ దానికే ఉద్యోగుల డిమాండ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొందరు అధికారులు ఉన్న చోటే తిష్ఠ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్‌ను ఏర్పాటుచేసింది. కొత్త ప్రభుత్వం సెబ్‌ను రద్దుచేసి తిరిగి ఎక్సైజ్ పునర్నిర్మాణం ప్రారంభించింది. ఇలా రెండు శాఖలు ఒక్కటిగా తిరిగి కలిసిపోతున్నందున జీరో సర్వీసు ప్రామాణికంగా అందరినీ బదిలీ చేయాలని 80శాతం మంది అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. అయితే, మంచి స్థానాల్లో ఉన్న కొందరు అందుకు విరుద్ధంగా తమను అక్కడే ఉంచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమను కదపకుండా కొత్తగా సెబ్ నుంచి వచ్చేవారికి కొత్త స్థానాలు ఇవ్వాలని పైస్థాయిలో చక్రం తిప్పుతున్నారు.
అలాగే సెబ్‌లోనూ మంచి స్థానాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటివారంతా కలిసి బదిలీలు తమకు అనుకూలంగా జరగాలని పట్టుబడుతున్నారు. ఇలా చేస్తే మిగిలిన అధికారులు, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2020లో ఎక్సైజ్ శాఖను విభజించి సెబ్‌ను ఏర్పాటుచేసినప్పుడు ఉద్యోగులందరినీ బదిలీ చేశారని, తిరిగి విలీనంలోనూ అలాగే చేయాలని ఎక్కువమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే, గజిటెడ్ అధికారుల సంఘంలోని కొందరు తమను కదపొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
వాసుదేవరెడ్డితో అంటకాగి..
జీరో సర్వీసు ప్రామాణికంగా బదిలీలు వద్దంటున్న వారిలో ఎక్కువ మంది బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో అప్పట్లో అంటకాగారు. ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులను మంచి స్థానాల్లో ఆయన నియమించుకున్నారు. ఆయన చేసిన కుంభకోణంలో ఈ అధికారుల ప్రమేయం కూడా ఎంతోకొంత ఉందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులందరినీ స్థానాలు మారిస్తే శాఖ ప్రక్షాళన అవుతుందని, గత ప్రభుత్వం పెట్టుకున్న వారిని అవే స్థానాల్లో కొనసాగిస్తే వైసీపీ ముద్రే కనిపిస్తుందని ఉద్యోగులు అంటున్నారు.
పునర్నిర్మాణ జీవో సిద్ధం
అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను విభజించి అందులోని 70శాతం మందిని సెబ్‌కు కేటాయించింది. తాజాగా సెబ్ ఏర్పాటు జీవోలు రద్దు చేయడంతో వారందరూ తిరిగి ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేయాలి. అయితే ఇందుకోసం కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వం మరో జీవోను జారీచేయాలి. ఇది ప్రస్తుతం సీఎం కార్యాలయంలో సిద్ధంగా ఉంది. సీఎంవో నుంచి వచ్చిన వెంటనే ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణ జీవోను విడుదల చేయనుంది. ఆ వెంటనే బదిలీలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నెలలోనే కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతున్నందున వీలైనంత త్వరగా బదిలీలు పూర్తిచేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.