Devineni Uma: వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు
ABN , Publish Date - Jan 29 , 2024 | 02:59 PM
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం.. ఆయన ఈ మేరకు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. బూడిద రవాణాతో వైసీపీ దొంగలు యధేచ్చగా కోట్లు దోచేస్తున్నారని.. వాళ్లంతా పందికొక్కులని విమర్శించారు. ఆ బూడిదని నెత్తికేసి కొట్టుకోండి లేదా మీరే తినండంటూ మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, వైసీపీ దొంగల మాఫియా బూడిద అక్రమ రవాణా చేస్తోందని దేవినేని ఉమా ఆరోపించారు. ఈ విషయంపై తాను పది రోజుల నుంచి సీఈకి వినతి పత్రాలు అందజేశానని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. వీటీపీఎస్ యాజమాన్యం డబ్బుల కక్కుర్తితో ఎమ్మెల్యే, మంత్రి, మంత్రి అనుచరులకు దాసోహం అయ్యారన్నారు. ఈ దుర్మార్గానికి వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్, కేశినేని నాని బాధ్యులని.. వీళ్లందరూ వాటాదారులేనని దుయ్యబట్టారు. కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల గ్రామాల్లో పరిశుభ్రమైన నీరు వచ్చే వరకు తాము ఆందోళన చేస్తామన్నారు. బూడిద దోపిడి ఆగే వరకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.