Share News

Tirumala : పెరుగన్నంలో జెర్రి!

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:39 AM

తిరుమలలోని అన్నప్రసాద సత్రంలో వడ్డించిన పెరుగన్నంలో జెర్రి కనిపించిందంటూ ఓ భక్తుడు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్‌కు చెందిన చందు అనే యువకుడు స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చాడు.

Tirumala : పెరుగన్నంలో జెర్రి!

టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిన భక్తుడు

అలాంటి అవకాశమే లేదని ఖండించిన టీటీడీ

తిరుమల, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని అన్నప్రసాద సత్రంలో వడ్డించిన పెరుగన్నంలో జెర్రి కనిపించిందంటూ ఓ భక్తుడు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్‌కు చెందిన చందు అనే యువకుడు స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చాడు. తలనీలాలు సమర్పించిన తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించేందుకు తిరుమలలోని మాధవ నిలయానికి(పీఏసీ2) వెళ్లారు. పెరుగన్నంలో జెర్రి కనిపించిందని అక్కడున్న సిబ్బందికి చందు చెప్పాడు. వెంటనే తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అనంతరం చందు మీడియాతో మాట్లాడుతూ.. పెరుగన్నంలో జెర్రిని చూసి షాకయ్యామన్నారు.

సిబ్బందిని ప్రశ్నిస్తే ‘వస్తుందిలే పో’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. వీడియోలు తీస్తున్న క్రమంలో కొందరు అధికారులు వచ్చి అరిటాకు ద్వారా జెర్రి వచ్చిందే తప్ప, అన్నంలో కాదని చెప్పారన్నారు. ఈ ఘటనపై టీటీడీ శనివారం స్పందించింది. అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమేనని ఖండించింది. ‘తిరుమల దర్శనార్థం వచ్చే వేలాదిమంది భక్తులకు పెద్దమొత్తంలో టీటీడీ అన్నప్రసాదాలను తయారు చేస్తోంది. అంతవేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యకరం. ఒకవేళ పెరుగన్నంలో అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తర్వాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రి ఉండడం సాధ్యం కాదు. ఇది పూర్తిగా కావాలనే చేసిన చర్యగా భావించాల్సి ఉంటుంది. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని టీటీడీ వివరణ ఇచ్చింది.

Updated Date - Oct 06 , 2024 | 04:39 AM