Share News

Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చింది

ABN , Publish Date - Aug 02 , 2024 | 10:57 AM

ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు.

Chandrababu:  ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చింది

అమరావతి: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు.


ప్రభుత్వ ఉద్యోగులు అంటే.. ప్రభుత్వంలో భాగమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా వారే కీలకమన్నారు. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.... అనేక సమస్యలు ఉన్నా రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1తేదీనే చెల్లించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. కలిసి కష్టపడదామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు అందరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఒక్క రోజులోనే దాదాపుగా పూర్తి చేసి వైసీపీకి నోట మాట లేకుండా చేసింది ఏపీ ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులు రెండో నెలలో కూడా పింఛన్ల పంపిణీని సమర్థంగా చేపట్టి సామాజిక పెన్షన్‌దారుల మన్ననలు పొందారు. మొదటి రోజు 98 శాతం పూర్తి చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 64 లక్షల మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.2737 కోట్లు అందించారు. వలంటీర్లు పంపిణీ చేస్తే తప్ప ఈ పంపిణీ సజావుగా సాగదన్న వైసీపీ ప్రభుత్వ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని సచివాలయ ఉద్యోగులు నిరూపించారు. పింఛన్ల పంపిణీపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పించన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశామని అన్నారు. గురువారం ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి అందించేలా సీఎం చంద్రబాబు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైందన్నారు. అందరూ హర్షించేలా పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.

Updated Date - Aug 02 , 2024 | 11:03 AM