Share News

Vasantha Krishna Prasad: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజలకు మంచి చేద్దాం..

ABN , Publish Date - Jul 29 , 2024 | 01:42 PM

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో మౌలిక వసతుల కల్పనకు రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని వీటిని ప్రాధాన్యత క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి కేటాయిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

Vasantha Krishna Prasad: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజలకు మంచి చేద్దాం..

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో మౌలిక వసతుల కల్పనకు రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని వీటిని ప్రాధాన్యత క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి కేటాయిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొత్త రెడ్డిగూడెం గ్రామంలో స్థానిక ఎన్డీఏ నాయకులు, అధికారులతో ఆయన వసంత ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ముందుగా దివంగత నేత అన్న ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. అధికారుల బదిలీలు పూర్తయిన తర్వాత మౌలిక వసతుల కల్పనకు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తున్న నిధులను జనసాంద్రత, సమస్య తీవ్రతను బట్టి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.


కక్షలు, కార్పణ్యాలు విడనాడి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. పదవులు అశాశ్వతమని, ప్రజలకు మనం చేసే మంచే చిరస్థాయిగా నిలిచిపోతుందని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పిన విధంగా ప్రజలకు మంచి చేద్దామని.. తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షిద్దాం.. తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని కోరారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా తను ఎటువంటి కక్షలకు పాల్పడలేదు కాబట్టే 42 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో తనను ప్రజలు గెలిపించారన్నారు. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందన్నారు. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.


నాగార్జునసాగర్ ప్రాజెక్టు 3వ జోన్ పరిధిలో సాగర్ జలాల విడుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జలాశయాలు పూర్తిగా నిండినా సరే విభజించబడిన ఆంధ్రప్రదేశ్‌లో దిగువకు సాగర్ జలాలను పూర్తిగా విడుదల చేయటం లేదని, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవని గతంలో దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తాజాగా వర్షాలు కురిసి జలాశయాలు కూడా పూర్తిగా నిండాయన్నారు. ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. కందులపాడు నుంచి నాగులూరు వరకూ విస్తరణతో కూడిన రహదారి అభివృద్ధికి రూ.42 కోట్ల నిధులు మంజూరు చేయించానని అది టెండర్, అగ్రిమెంట్ కూడా పూర్తయిందన్నారు. కానీ గతంలో బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదన్నారు. నాగులూరు నుంచి మద్దులపర్వ వరకు కూడా బీటీ రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రహదారి అభివృద్ధి పూర్తి స్థాయిలో చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్ల నిర్వహణకు, మరమ్మత్తులకు కూడా తగు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. త్వరలో గ్రామాల వారీగా పర్యటించి నేరుగా సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..

Cyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..

Updated Date - Jul 29 , 2024 | 02:05 PM