Share News

రీసర్వే డ్రోన్లు ఢమాల్‌!

ABN , Publish Date - Nov 12 , 2024 | 05:03 AM

జంతర్‌మంతర్‌ జగన్‌ పాలనలో ఇదొక కొత్తకోణం! కాసుల యావలోపడి నాడు అత్యంత దారుణమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి.

రీసర్వే డ్రోన్లు ఢమాల్‌!

నింగిలో తిరగాల్సినవి నేలపాలు.. వాటిపై పెట్టిన కోట్ల డబ్బు బూడిదపాలు

డ్రోన్‌ టెక్నాలజీతో రీసర్వే చేపడతామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన జగన్‌ సర్కారు నాడు తెరవెనుక నడిపిన కొనుగోళ్ల బాగోతం ఇది. ‘జగ నన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష’ పేరిట సర్వే కోసం కొన్న డ్రోన్లలో కొన్నే పనిచేశాయి. మిగతావి సాంకేతిక వైఫల్యాలతో నేలకూలాయి. కొందరు సర్వేయర్లు గాయపడ్డారు కూడా. అయితే, రాజకీయ సలహాదారుకు చెందిన అనుచర కంపెనీల నుంచి వీటిని కొనడంతో.. ఈ ఉదంతాలేవీ వెలుగుచూడకుండా చీకట్లో కలిపేశారు. రూ.200కోట్లు ఈ కంపెనీలకు చెల్లించి..

చెత్త డ్రోన్లు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ తెచ్చుకున్న ఈ డ్రోన్లు నాలుగురోజులు కూడా పనిచేయలేదు. అయినా..ఇవేవీ బయటకు రాకుండా నాటి సర్వే అధికారులు తొక్కిపెట్టారు. అధికారంలోకి రాగానే రీ సర్వే నిలిపివేసిన ప్రభుత్వం... జగన్‌ హయాం డ్రోన్ల దందాపైనా దృష్టిపెట్టాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

జగన్‌ జమానాలో 200 కోట్లతో డ్రోన్లు కొనుగోలు

డీల్‌లో ఎన్నెన్నో అడ్డగోలు పనులు

న్యాయసమీక్షకు వెళ్లకుండా బిట్లు బిట్లుగా టెండర్లు

రాజకీయ సలహాదారు అనుచర కంపెనీలకు లబ్ధి

సర్కారుకు చెత్త డ్రోన్లు అంటగట్టిన వైనం

కొన్న 52 డ్రోన్లలో రెక్కలు తెగి పడిపోయినవి 44

బాగుచేయాలంటే రూ. కోట్లు కుమ్మరించాల్సిందే

రాగానే రీ సర్వేను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం

డ్రోన్ల దందాపైనా దృష్టి పెట్టాలని రైతు సంఘాల వినతి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జంతర్‌మంతర్‌ జగన్‌ పాలనలో ఇదొక కొత్తకోణం! కాసుల యావలోపడి నాడు అత్యంత దారుణమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా ‘డ్రోన్ల’ బాగోతం బయటకొచ్చింది. భూముల సర్వే పేరు చెప్పి, ఆధునిక టెక్నాలజీని వాడుతున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేసి రూ.200 కోట్లతో ఎందుకూ పనికిరాని డ్రోన్లు, రోవర్లు కొన్నారు. రూ.100 కోట్ల మేర ఉన్న ఏ కొనుగోలు అయినా న్యాయ కమిషన్‌ (జ్యుడీషియల్‌ ప్రివ్యూ) ఆమోదానికి వెళ్లాల్సి ఉండగా, దాన్నుంచి తప్పించి బిట్లుబిట్లుగా కొనుగోలు చేయించారు. ఓ రాజకీయ సలహాదారు బినామీలకు లబ్ధిచేకూర్చారు. ప్రభుత్వానికి చెత్త డ్రోన్లు, రోవర్లు వచ్చిపడ్డాయి. కొన్నందుకు వాటిని భూముల సర్వే పేరిట కొద్దిరోజులు ఆకాశంలో తిప్పారు. ఇప్పుడవి మూలనపడ్డాయి. వాటికి మరమ్మతులు చేయించాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. మళ్లీ తన ప్రభుత్వమే ఽవస్తుందన్న ధీమాతో అనామక కంపెనీల నుంచి డ్రోన్లు కొని వాటిని సరిగ్గా పక్షం రోజులు కూడా వాడకుండా పక్కనపడేశారు. కొన్నందుకు కంపెనీల ఖాతాల్లో ప్రభుత్వ ధనం జమ అయింది. సర్కారుకు చెత్త సరుకు వచ్చింది. ఇప్పుడవి ఇనుప ముక్కలుగానే మిగిలిపోయేలా ఉన్నాయు. 200 కోట్లు వెచ్చించి కొన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడకపోతే ఎవరిది బాధ్యత? ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ఎవరిపై చర్యలు తీసుకుంటారు? రీ సర్వేను ఆపేసిన కూటమి సర్కారు, ఆ పేరిట జరిపిన కొనుగోళ్ల అక్రమాలపై దృష్టి సారించకపోవడం చర్చనీయాంశంగా మారింది.


ఏదీ పారదర్శకత?

జగన్‌ సర్కారు 2019 డిసెంబరులో భూముల సర్వే ప్రారంభించింది. కానీ సర్వే, సరిహద్దుల చట్టాన్ని త్రికరణ శుద్ధిగా అమలుచేయలేదు. భూములను నేలమీద ఉండి కొలిస్తేనే అనేక సమస్యలు వస్తున్నాయి. కోట్లల్లో భూ వివాదాలు ఉంటున్నాయి. జగన్‌ సర్కారు ఈ వాస్తవాన్ని గమనించకుండా, తామే బెస్ట్‌ అనిపించుకోవాలని అనుకుంది. డ్రోన్లు, మినీ విమానాలతో ఆకాశం నుంచి భూముల ఫొటో లు తీసి వాటి ఆధారంగా సర్వే చేయాలని పెద్దప్లాన్‌ వేశా రు. సంప్రదాయ పద్ధతుల్లో సర్వే చేయాలంటే కొత్తగా ఏ పరికరం కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే సర్వేయర్ల వద్ద ఉన్న చైన్‌లు, ఇతర సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. జగన్‌ సర్కారు, ఆయన అనుంగ అధికారులు ఖరీదైన సాంకేతికతను తెచ్చిపెట్టుకోవాలని, ఇందుకోసం భారీ గా కొనుగోళ్లు జరపాలని భావించారు. రోవర్‌లు, డ్రోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్‌లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనాలని నిర్ణయించారు. అయితే, ఇందులో ఏమాత్రం పారదర్శకత ను ప్రదర్శించకూడదనుకున్నారు. తమ అస్మదీయ కంపెనీలకే టెండర్లు వెళ్లేలా నిబంధనలు, మార్గదర్శకాలు మార్చేశారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ(న్యాయ కమిషన్‌) పరిశీలనకు టెండర్లు వెళ్లకుండా వ్యవహారం నడిపారు. నిజానికి జగన్‌కు పారదర్శకతే ఉంటే రీ సర్వేకు అవసరమైన డ్రోన్లు, రోవర్‌లు ఒకేసారి కొనవచ్చు. ఇందుకు గ్లోబల్‌ టెండర్‌ పిలిస్తే అంతర్జాతీయ కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొని పోటీ ని పెంచుతాయి. ఫలితంగా ప్రభుత్వానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలు అందుతాయి. అయితే, దీని వల్ల జగన్‌కు, ఆయన అనుచర గణానికి ఏం ఉపయోగం? అందుకే గ్లోబల్‌ టెండర్లు పిలవలేదు. తమకు నచ్చినట్లుగా టెండర్లు పిలిచి ముందుగానే అనుకున్న కంపెనీలకు టెండర్‌ కట్టబెట్టారు. ఇందులో ఓ రాజకీయ సలహాదారు అనుచరులు తెచ్చిపెట్టుకున్న అద్దె కంపెనీలు కూడా ఉన్నాయి. బిట్లు బిట్లుగా విడగొట్టి చిన్న టెండర్లుగా మార్చి బిడ్డింగ్‌ జరిపారు. దీంతో సహజంగానే పెద్ద కంపెనీలు టెండర్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలే దు. అద్దె కంపెనీలే టెండర్‌లో పాల్గొని బిడ్‌లు దక్కించుకున్నాయి. ఇలా 2022 నుంచి 2024 ఫిబ్రవరి నాటికి 52 డ్రోన్లు కొన్నా రు. 3వేలకు పైగా రోవర్లు కొనుగోలు చేశారు. వీటి కొనుగోలు వ్యయం 200 కోట్లపైనే. ఇదంతా కేవలం ఆరు వేల గ్రామాల్లో జరిగిన భూ సర్వేకోసం చేసిన దే. ఇంకా 12వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వేచేయాలి. ఇందుకోసం దశల వారీగా డ్రోన్లు కొనాలని పెద్ద ప్లాన్‌లు వేశారు.


నేలకూలిన 44 డ్రోన్లు

సర్వేకోసం కొన్న డ్రోన్లు కొన్ని బాగా పనిచేశాయి. మరి కొన్ని సాంకేతిక వైఫల్యాలతో నేలకూలాయి. కొన్ని జనావాసాల్లో కూలిపోయాయి. ఈ ప్రక్రియలో కొందరు సర్వేయర్లు గాయపడ్డారు. అయినా వీటిని బయటకురాకుండా నాటి సర్వే అధికారులు తొక్కిపెట్టారు. ప్రతిపక్షాలు గొడవ చేస్తాయన్న భయంతో ఆ ఉదంతాలు వెలుగుచూడకుండా చీకట్లో కలిపేశారు. ఇలా రీ సర్వే జరుగుతున్న సమయంలోనే 12 డ్రోన్లు ఆకాశం నుంచి నేలకూలి దెబ్బతిన్నాయి. సహజంగా ఆయా కంపెనీలే మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్‌ కింద సర్వీసు చేయాలి. కానీ, ఆ కంపెనీలు ఓ రాజకీయ సలహాదారు అద్దెకు తెచ్చుకున్నవి కావడంతో అవి చేతులెత్తేశాయి. దీంతో ఆ డ్రోన్లు ఇనుపముక్కలుగా మిగిలాయి. ఆ తర్వాత మరో 32 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేకు ఉపయోగించారు. కానీ ఏం లాభం? కొత్తవాటి పనితీరు తెలియకముందే రె క్కలు తెగిన పక్షాల్లా నేలరాలాయి. సర్వే అధికారులు, సిబ్బంది వాటిని భద్రంగా ఆఫీసులకు తరలించారు. ఇలా 44 డ్రోన్లు మూలనపడ్డాయి. వాటిని బాగుచేయాలంటే కోట్లరూపాయల ఖర్చుకానుందని సర్వే అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో దెబ్బతిన్న డ్రోన్లు ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇవన్నీ జగన్‌కు, ఆయన అనుంగ ఉన్నతాధికారులకు తెలుసు. అయితే, వారి సిఫారసుల మేరకే కొన్న వి కావడంతో డ్రోన్ల డ్యామేజీపై స్పందించలేదు.

విచారణ జరుపుతాం

రీ సర్వే పేరిట కొనుగోలు చేసిన డ్రోన్లు ఎందుకూ పనికిరాకుండా పోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తామని వెల్లడించింది. రీ సర్వే అంతా తప్పులే అని, ఆ పేరిట జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు.

Updated Date - Nov 12 , 2024 | 05:04 AM