Share News

రెండేళ్లుగా బిల్లులు ఇవ్వట్లేదు!

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:40 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 153 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించిన తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఏబీసీఏ) ఆధ్వర్వంలో కాంట్రాక్టర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టారు.

రెండేళ్లుగా బిల్లులు ఇవ్వట్లేదు!

  • రాష్ట్రంలో 153 పీహెచ్‌సీలు కట్టాం

  • రూ.130 కోట్ల బకాయిలు చెల్లించాలి

  • ఆరోగ్య కేంద్రాల వద్ద కాంట్రాక్టర్ల ఆందోళన

విజయవాడ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 153 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించిన తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఏబీసీఏ) ఆధ్వర్వంలో కాంట్రాక్టర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్లు తాము నిర్మించిన పీహెచ్‌సీల వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. కొవిడ్‌ సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పీహెచ్‌సీల నిర్మాణం చేపట్టామని, రెండేళ్లు గడిచిపోతున్నా తమకు మాత్రం బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది అప్పులు చేసి పనులు చేశారని, వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంట్రాక్టర్లు వాపోయారు. 153 పీహెచ్‌సీలను కొత్తగా నిర్మించామని, మరో 956 పీహెచ్‌సీలకు మరమ్మతులు చేశామని పేర్కొన్నారు. వీటికి సంబంధించి సుమారు రూ.130 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. మరో 88 పీహెచ్‌సీలు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటికి కూడా బిల్లులు చెల్లించడం లేదని, ఎన్నిసార్లు అధికారులను కలిసి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు వాపోయారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తమ బాధను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

Updated Date - Nov 20 , 2024 | 04:40 AM