Share News

East Godavari : ముంచెత్తిన వాన

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:04 AM

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో అనేక గ్రామాల్లోకి వరదనీరు పోటెత్తింది.

East Godavari : ముంచెత్తిన వాన
Rains In AP

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఏజెన్సీ గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు

పలు ఇళ్లు నేలమట్టం.. కొట్టుకుపోయిన పశువులు

కృష్ణా, గోదావరికి భారీగా వరద.. వరదలో చిక్కుకున్న 30 మంది

రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌.. కొండవాగులో కొట్టుకుపోయిన కారు

కారులో ఐదుగురు.. కాపాడిన గ్రామస్థులు

యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. 48 గంటల్లో భారీవర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో అనేక గ్రామాల్లోకి వరదనీరు పోటెత్తింది. దీంతో జనం సమీప కొండలపైకి పరుగుతీసి ప్రాణాలు కాపాడుకున్నారు. గురువారం కోస్తాంధ్రలో అక్కడక్కడ, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోతగా వాన పడింది. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 137.25 మి.మీ, కొయ్యలగూడెంలో 111, కోనసీమ జిల్లా మండపేటలో 96.75, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92, నిడదవోలులో 91, తాడేపల్లిగూడెంలో 95.8, కూనవరంలో 74, పెంటపాడులో 73.5, కొవ్వూరులో 71.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాత్రికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.


ఇది వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. తరువాత వాయువ్యంగా పయనించి శనివారం ఒడిశాలో తీరం దాటుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

ఏలూరులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు..

ఏలూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో పెదవాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. గండిపడే అవకాశాలు ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. పోలవరం మండలం, బుట్టాయిగూడెం మండలాల్లో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజవరం బ్రిడ్జివద్ద ఎర్రకాల్వ ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. గోదావరి వరద పెరుగుతుండటంతో అధికారులు, సిబ్బందిని ఇరిగేషన్‌ ఎస్‌ఈ అప్రమత్తం చేశారు. తమ్మిలేరు వరద వల్ల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరులో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశామని, అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్టు కలెక్టర్‌ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


వరదలో చిక్కుకున్న స్కూల్‌ బస్సు

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం వద్ద పంటకాల్వ వరదలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూలు బస్సు చిక్కుకుంది. బస్సులో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. స్థానికులతో పాటు విద్యార్థులు ధైర్యం చేసి వాగులో దిగి బస్సును బయటకు నెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పెదవాగు ఉగ్రరూపం

వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగు బ్రిడ్జిపై నుంచి కొన్ని మీటర్ల ఎత్తున వరద ప్రవహించటంతో ఎద్దువాగు వంతెనకు ఇరువైపులా నిర్మించిన అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయి కేవలం వంతెన మిగిలింది. పెదవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టు దిగువన కమ్మరగూడెం, అల్లూరి నగర్‌, కోయమాధారం ఒంటిబండ, ఊటగుంపు, రామవరం, గుళ్ళవాయి, గ్రామాల్లోకి వరద పోటెత్తి కొన్ని ఇళ్లు నేలమట్టమ య్యాయి. కమ్మరగూడెం గ్రామస్థులు సమీప కొండగుట్ట పైకి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. అనేక చోట్ల రహదారికి గండ్లుపడ్డాయి. నాళ్ళవరం కాలనీ వద్ద కొండవాగులు పొంగడంతో పశువులు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో మండలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కొండవాగులో చిక్కుకున్న కారు..

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొండవాగు ఉధృతిలో ఒక కారు కొట్టుకుపోయింది. రాజమహేంద్రవరం నుంచి వేలేరుపాడు మండలం రుద్రంకోటకు కారు వెళ్తుండగా కొండ వాగు ప్రవాహంలో వీరి కారు కొట్టుకుపోయింది. కారులో ముగ్గురు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు ఎదురుపొదల్లో చిక్కుకోవడంతో 40 మంది గ్రామస్థులు పీకల్లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఏలూరు జిల్లాలో పెదవాగుకు గండి పడే అవకాశం ఉండటంతో ఏలూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


వరదలో చిక్కుకున్న 30 మంది..

పెదవాగు వరద కారణంగా తెలంగాణలోని నారాయణపురం సమీపంలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద సుమారు 10 అడుగుల మేర రహదారిపై వరద నీరు ప్రవహించింది. అంతకు ముందే అశ్వారావుపేట వైపు నుంచి వేలేరుపాడు వైపు వస్తున్న వాహనదారులు పెదవాగు బ్రిడ్జిపై ఎటూ వెళ్లే వీలులేక చిక్కుకుపోయారు. ఇందులో కొందరు కట్టమైసమ్మ ఆలయంలో ఆశ్రయం పొందగా క్షణ క్షణానికి వరద పెరిగిపోయి ఆలయం సగానికి పైనే మునిగిపోవడంతో ఆలయం షెడ్ల పైకి ఎక్కారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడికి చేరుకొని జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వికి పరిస్థితి వివరించి 30 మందికిపైనే వరదలో చిక్కుకున్నట్లు తెలిపారు. రెండు హెలికాప్టర్లతో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. సాయంత్రానికి 25మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం. మిగిలిన వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కృష్ణా నదికి అనుసంధానంగా ఉన్న వాగులు, వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన కాలవలు పూర్తిస్థాయి నీటిసామర్థ్యంతో ప్రవహిస్తున్నాయి.

Updated Date - Jul 19 , 2024 | 07:27 AM