Share News

జగనన్న అనారోగ్య శ్రీ!

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:00 AM

ఆరోగ్యశ్రీ అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ సీఎం జగన్‌ గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవంలో అన్నీ లోపాలే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.

 జగనన్న అనారోగ్య శ్రీ!

పేరుకే జగన్‌ సర్కారు గొప్పలు

ఉమ్మడి జిల్లాలో అందని ఉచిత వైద్యం

రూ.100 కోట్ల బకాయిలు

వైద్యం చేయలేమంటున్న ఆసుపత్రులు

ప్రాణాలు పోతున్నా పట్టని వైనం

108, 104 సేవలదీ ఇదే తీరు

దేళ్లుగా రోగులతో చెలగాటం

మండపేటకు చెందిన ఒక వ్యక్తి గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ఒక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. ఇవి రెండూ ఆరోగ్య శ్రీ పరిధిలోనివే. మీరు రెండు రకాల వ్యాధులతో బాధపడుతున్నందున ఆరోగ్యశ్రీ వర్తించదంటూ తిప్పి పంపేశారు. దీంతో వారు రోజుకు రూ.50 వేలకు పైగా ఖర్చు చేసి ప్రైవేటుగా వైద్యం చేయించుకుంటున్నారు. రెండు వ్యాధులూ ఆరోగ్యశ్రీ పరిధిలోనే ఉన్నప్పుడు తమకు ఎందుకు వర్తించదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడకు చెందిన ఒక మహిళకు గాల్‌బ్లేడర్‌లో రాళ్లు రావడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌కు గురైంది.చికిత్స నిమిత్తం నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళ్లారు. దీని చికిత్స ఆరోగ్య శ్రీ పరిధిలో ఉంది. ఇది తమ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని వారు తేల్చి చెప్పారు. దీంతో వారు రూ.2 లక్షలు ఖర్చు చేసి అదే ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

పిఠాపురానికి చెందిన ఒక వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో పాటు కేన్సర్‌ బారిన పడ్డాడు. అతడికి చికిత్స చేయించేందుకు విశాఖ, కాకినాడల్లోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ఆస్పత్రులకు బంధువులు తీసుకువెళ్లారు. ఆరోగ్యశ్రీ వర్తించదని, కావాలంటే ప్రైవేటుగా చికిత్స చేయించుకోవాలని చెప్పారు.రూ.9లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకున్నారు.

ఇవే కాదు ఇలాంటివి ఎన్నో సంఘటనలు వైసీపీ ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్నాయి. ఆరోగ్యశ్రీ అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ సీఎం జగన్‌ గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవంలో అన్నీ లోపాలే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లిన వారికి వైద్య సేవలు గగనంగా మారాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు రకరకాల కొర్రీలు పెడుతున్నారు. గతంలో చికిత్సకు ఆస్పత్రికి వెళ్లిన వెంటనే చికిత్స ప్రారంభమయ్యేది. తదనంతరం అనుమతులు తీసుకునేవారు. ఇప్పు డు మాత్రం అనుమతులు తీసుకున్న తర్వాత చికిత్స ప్రారంభిస్తున్నారు. చికిత్సల నిమిత్తం వెళ్లిన రోగులకు రెండు, మూడు రోజులు వేచి చూడక తప్పడం లేదు. కొన్ని చికిత్సలకు వారం రోజుల వరకు అనుమతులు రావడం లేదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వ్యాధులకు కొన్ని సమయాల్లో అనుమతులు తిరస్కరిస్తున్నారు.

పిఠాపురం/రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 26: జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ.. అనారోగ్యశ్రీగా మారింది.. బిల్లులు చెల్లించకపోవడంతో ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.. బిల్లు కట్టండి.. వైద్యం చేయించుకోండి.. ప్రభుత్వం ఇస్తే మీకే బదలాయింపు చేస్తామనే రీతిన ఐదేళ్లూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించారు. రియల్‌గా జరిగిందిదే. అయితే జగన్‌.. వైసీపీ నాయకులు కలగంటారో ఏమో కానీ వారు చెప్పేమాటలు వేరేగా ఉంటాయి.. దేశంలోనే ఎక్కడా లేని అన్ని రకాల చికిత్సలను ఆర్యోగ శ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఉచితంగానే వైద్యసేవలందుతాయంటూ చెప్పే గొప్పలు అన్నీఇన్నీ కావు. ప్ర చార ఆర్భాటాలు తప్ప వాస్తవంలో మాత్రం అందుకు భిన్న మైన పరిస్థితి. అత్యవసర వైద్య సేవల నిమ్తితం వెళ్లిన పేదలకు ఆరోగ్యశ్రీ వర్తించదంటూ తిరస్కరణలు ఎదురవుతున్నాయి. రకరకాల సాకులు చూపుతూ ఆరోగ్యశ్రీ వైద్యసేవలందించేందుకు నిరాకరిస్తున్నారు. పేదలు లక్షల రూపాయలు అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. వైద్యమే సరిగా అందట్లేదంటూ ప్రజలు వాపోతుంటే దాన్ని పట్టించుకోకుండా ఆరోగ్యశ్రీ చికిత్సల పరిమితిని రూ.25 లక్షలకు పెంచామంటూ ఎన్నికల ముందు జగన్‌ హడావుడి చేయడంతో పాటు మళ్లీ ప్రజలందరికీ కొత్తగా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులు అందించారు. ఎంతో మంది తిరస్కరణకు గురైన వారున్నారంటే ఆరోగ్యశ్రీ అమలు ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది.

రూ.వెయ్యి దాటితే వట్టిదే..

రూ.వెయ్యి దాటిన ప్రతి చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామంటూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గొప్పలు చెప్పుకుంటోంది. ఆచరణలో మాత్రం ఎక్కడా అమలు కాలేదు. ఇది నమ్మి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన వారికి షాక్‌లు తగులుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.వెయ్యి నుంచి రూ.50 వేలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావని తేల్చి చెబుతున్నారు. వారు అప్పు చేసి మరీ చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

పెండింగ్‌లో బకాయిలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి.పలుమార్లు ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు హెచ్చరించ డం, ప్రభుత్వం కొంత మొత్తం బిల్లులు చెల్లించడం, మళ్లీ సేవలు కొనసాగించడం వైసీపీ పాలనలో నిత్యకృత్యంగా మా రింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 215 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సర్జరీలు, చికిత్సలు ఏడాదికి 80 వేల నుంచి 85 వేలు జరుగుతున్నాయి. రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల వరకు ఖర్చవుతోంది. కాకినాడ జిల్లాలో 40 నెట్‌వర్క్‌ ఆస్ప త్రులు ఉండగా 25 ఆస్పత్రులకు రూ.50 కోట్లు బకాయి ఉం డొచ్చని అంచనా. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు సమాచారం. కాకినాడ, రాజమ హేంద్రవరంలో జిల్లా ఆసుపత్రులు టీచింగ్‌ ఆసుపత్రులు కావడంతో ఇక్కడ సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండాలి. కానీ లేవు.

మొరాయిస్తున్న 108లు

అత్యాఽదునిక సౌకర్యాలు, లైఫ్‌ సపోర్ట్‌తో 108 అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. పాత అంబులెన్స్‌లకు రంగులు వేసి వాటినే క్షేత్రస్థాయి తిప్పుతున్నారు. దీంతో ఇవి తరచూ మొరాయిస్తున్నాయి. సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 108కి ఫోన్‌ చేస్తే 10-15 నిమిషాల వ్యవధిలో వచ్చేది. ఇప్పుడు ప్రతి మండలం, ప్రతి పట్టణంలో 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఫోన్‌ కాల్‌ వెళ్లిన అరగంటకు గానీ రావడం లేదు. మరో వైపు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నా 108 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తుంటే వెహికల్స్‌ అందుబాటులో లేవనే సమాధానం వస్తోంది.కొంతకాలంగా పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకు చెందిన వారికిదే పరిస్థితి ఎదురైంది. అంబులెన్స్‌లో సౌకర్యాలు అరకొరగానే ఉంటున్నాయి. సిబ్బంది జీతాలు పెంచకపోవడం, ఉన్నవారిపైనే భారం అధికం కావడంతో విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రూ.2 లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించుకున్నా..

వైసీపీ అధికారంలోకి వచ్చాక వైద్యానికి రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. నాకు పాముకాటు కారణంగా కాలు తీసేయాల్సి వచ్చింది. శస్త్రచికిత్స చేయించేందుకు రూ.2 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యశ్రీలో చికిత్స కోసం ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఉపయోగంలేదు. తప్పక రూ.2లక్షలు అప్పు చేసి శస్త్రచికిత్స చేయించుకున్నా. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అర్జీ పెట్టుకున్నా అదీ రాలేదు. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదు.

- పేపకాయల రాంబాబు, గండేపల్లి

104 వైద్య సేవలూ అంతే..

గ్రామాల్లోకి వచ్చి 104 అంబులెన్స్‌ ద్వారా వైద్యులు పరీక్షలు నిర్వహించి అన్ని పరీక్షలకు ఉచితంగా మందులు అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో అన్ని రకాల వ్యాధులకు ఇక్కడే చికిత్స అందించడంతో పాటు ఉచితంగా మందులు అందించేవారు. ఇప్పుడు సాధారణ జ్వరం, తలనొప్పి, వంటి నొప్పులు, రొంప, జలుబు, బీపీ, షుగర్‌ తదితర వ్యాధులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. గతంలో నెలరోజులకు సరిపడా మందులు ఇచ్చేవారు. ఇప్పుడు 10-15 రోజులకు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన మందులను బయట కొనుక్కోవాల్సి వస్తోంది. కొత్త అంబులెన్స్‌లు రావడం మినహా 104 ద్వారా అందించే సేవలు మెరుగుపడకపోగా తగ్గిపోయాయని ప్రజలు చెబుతున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 01:00 AM