Share News

దశాబ్దాల కల సాకారం

ABN , Publish Date - Dec 07 , 2024 | 01:17 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతుంది. ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు రామచంద్రపురంలో ప్రారంభానికి సిద్ధ అయ్యింది. ఈ నెల 10న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో రామచంద్రపురం పరిసర మండలాల ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులకు జిల్లా కోర్టు బెంచి ద్వారా న్యాయసేవలు చేరువ కానున్నాయి

దశాబ్దాల కల సాకారం
రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు భవనం

రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు సిద్ధం

ఈనెల 10న ప్రారంభించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతుంది. ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు రామచంద్రపురంలో ప్రారంభానికి సిద్ధ అయ్యింది. ఈ నెల 10న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో రామచంద్రపురం పరిసర మండలాల ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులకు జిల్లా కోర్టు బెంచి ద్వారా న్యాయసేవలు చేరువ కానున్నాయి.

రామచంద్రపురం (ద్రాక్షారామ) డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రామచంద్రపురంలో 1994 నుంచి జిల్లా సెషన్స్‌ కోర్టు బెంచి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించారు. పలు బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గాలు, సీనియర్‌ న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు జిల్లా సెషన్స్‌ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్తుత బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిల్లి మురళీ, కార్యవర్గం, ఇతర సీనియర్‌ న్యాయవాదుల కృషి ఫలించింది. దీంతో 15 మార్చి 2024న రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఎన్నికల కోడ్‌ రావడంతో కొంత ఆలస్యం జరిగింది. తిరిగి కోర్టు ఏర్పాటు వేగవంతంగా జరిగింది. 1931 నుంచి జూనియర్‌ సివిల్‌జడ్డి కోర్టు నిర్వహిస్తున్న భవనంలో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు ఏర్పాటు చేశా రు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్డును బార్‌ అసోసియేషన్‌ భవనంలోకి మార్చి నిర్వహిస్తున్నారు.

వర్చువల్‌గా ప్రారంభం...

రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టును రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఽథీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఈనెల 10న ఉదయం 10.15 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలనా న్యాయమూర్తి నైనాల జయసూర్య, న్యాయమూర్తులు ఆర్‌.రఘునందనరావు, బివిఎల్‌ఎన్‌ చక్రవర్తి, టి.మల్లి ఖార్జున, సుమతిజగడం, న్యాపతి విజయ్‌ సమక్షంలో ప్రారంభోత్సవం జరుగుతుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిల్లి మురళీ, కార్యదర్శి వాడ్రేవు సాయి ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొంటారన్నారు.

తీరనున్న ప్రజల కష్టాలు...

రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు ఏర్పాటుతో ప్రజలు, కక్షిదారుల కష్టాలు తీరనున్నాయి. జిల్లా కోర్టుసేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. ఇప్పటివరకు రామచంద్రపురం జూనియర్‌ సివిల్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పులు, ఆలమూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, అనపర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు తీర్పులపై అప్పీలుకు జిల్లా కోర్టు పరిధిలోకి వచ్చే సివిల్‌, క్రిమినల్‌ కేసులకు రాజమహేంద్రవరం జిల్లా సెషన్స్‌ కోర్టుకు వెళ్లవలసి వచ్చేది. రామచంద్రపురంలో జిల్లా కోర్టు ఏర్పాటుతో రామచంద్రపురం పట్టణం, మండలం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు, రాయవరం, మండపేట, అనపర్తి, బిక్కవోలు మండలాల ప్రజలకు దూరభారం తప్పనుంది.

Updated Date - Dec 07 , 2024 | 01:17 AM