అంబులెన్స్‌లో ప్రసవం.. ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం
ABN , Publish Date - May 30 , 2024 | 12:47 AM
ఆలమూరు ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి 108అంబులెన్స్‌లో తరలిస్తుండగా జాతీయ రహదారిపై నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది సాయంతో ప్రసవం జరిగింది.
ఆలమూరు, మే 29: ఆలమూరు ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి 108అంబులెన్స్‌లో తరలిస్తుండగా జాతీయ రహదారిపై నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది సాయంతో ప్రసవం జరిగింది. ఆలమూరులోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తోన్న ఎన్.సుశీల(28)కు నెలలు నిండి నొప్పులు మొదలు కావడంతో మంగళవారంరాత్రి ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది రాజమహేంద్రవరం తీసుకెళ్లాలని చెప్పడంతో 108 అంబులెన్స్‌లో బయల్దేరగా చెముడులంక సమీపంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ ఈఎంటీ డీవీవీ రమణ, ఫైలట్ శ్రీపాఠీ సహకారంతో ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది వివరించారు.
బంధువులు, స్థానిక నాయకుల ఆందోళన
పురిటి నొప్పులతో ఆసుపత్రికి తీసుకొచ్చిన గర్భిణికి వైద్యం చేయకుండా రాజమహేంద్రవరం తరలించాలని సూచించి పంపించడంపై సుశీల బంఽధువులు, స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండకుండా ఎవరు వచ్చినా ఇదే తీరుతో మరో ఆసుపత్రికి పంపిస్తున్నారన్నారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు కనీసం అందుబాటులో లేరని ఆరోపించారు.
మెరుగైన వైద్యం కోసమే: గోపిరామ్,
ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు వైద్య సేవలు అంది స్తున్నాం. అయితే మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచిస్తున్నాం. కావాలని మరో ఆసుపత్రికి తరలిస్తున్నట్టు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు.