ఆక్వా చెరువుల అఫిడవిట్‌ను ఎన్జీటీకి సమర్పించాలి
ABN , Publish Date - Sep 26 , 2024 | 01:15 AM
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సర్వే నంబర్ల వారీగా స్టే ఆర్డరు జారీ చేసిన అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించిన అఫిడవిట్‌ను జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్జీటీకి సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు.
అమలాపురం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సర్వే నంబర్ల వారీగా స్టే ఆర్డరు జారీ చేసిన అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించిన అఫిడవిట్‌ను జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్జీటీకి సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. అనుమతులు లేని ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావులతో కలిసి మత్స్యశాఖ, రెవెన్యూ సిబ్బందితో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. దేవదాయ, ఇతర ఆక్రమిత భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాజోలు, మలికిపురం, మామిడికుదురు మండలాల పరిధిలో 292 మంది రైతుల అధీనంలో సాగవుతున్న 688 ఎకరాల ఆక్వా సాగుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించామన్నారు. పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత చట్టాలను ఉల్లంఘించడంతో పాటు సర్వే నంబర్లు లేకుండా అక్రమంగా తీరప్రాంతంలో నిర్వహిస్తున్న అక్రమ ఆక్వా సేద్యం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్, తీరప్రాంత ఆక్వా అథారిటీ నిబంధనలు, కోస్టల్ రీజియన్ జోన్, కాలుష్య నియంత్రణ మండలి వంటి అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ఆక్రమిత అనధికార ఆక్వా సేద్యానికి సంబంధించి విద్యుత్ సరఫరా నిలుపుదల చేసేందుకు అవసరమైన పోలీసు రక్షణను మత్స్యశాఖ, ట్రాన్స్‌కో విభాగాలకు కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో జి.కేశవర్థనరెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఈఈ రవికుమార్, తహసీల్దార్లు మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు.