Share News

ఆగ్రహావేశం!

ABN , Publish Date - Feb 09 , 2024 | 01:09 AM

ఆశా వర్కర్లు పిడికిలి బిగించారు..సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నిన దించారు.. జగన్‌ను గద్దె దింపుతామంటూ ప్రతినబూనారు. నిత్యం ప్రజల మధ్య ఉండే ఆశావర్కర్లకు కనీస జీతాలు కూడా ఇవ్వకపోవడంతో ఆందోళన బాటపట్టారు.

ఆగ్రహావేశం!
రాజమహేంద్రవరంలో ఆశ వర్కర్లు, పలు సంఘాల నాయకుల నిరసన

ఆశ కార్యకర్తల చలో విజయవాడ భగ్నం

ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

జిల్లాలో 2500 మంది కార్యకర్తలు

పలు చోట్ల 300 మంది అరెస్టు

సీఎం జగన్‌ తీరుపై అసహనం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

12 డిమాండ్ల సాధనకు పోరాటం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : ఆశా వర్కర్లు పిడికిలి బిగించారు..సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నిన దించారు.. జగన్‌ను గద్దె దింపుతామంటూ ప్రతినబూనారు. నిత్యం ప్రజల మధ్య ఉండే ఆశావర్కర్లకు కనీస జీతాలు కూడా ఇవ్వకపోవడంతో ఆందోళన బాటపట్టారు. ఛలో అసెంబ్లీ పేరుతో అసెంబ్లీని ముట్టడికి రోడ్డెక్కారు. ఎక్కడి కక్కడ నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అయినా ఎవరూ జంకగుండా పోలీసుల ఎదుటే సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేసి తిరుగుబావుటా ఎగరవేశారు. కనీస వేతనంతో పాటు 12 డిమాండ్ల సాధనకు ఆందోళన బాటపట్టారు. జిల్లాలో సుమారు 2500 మంది ఆశావర్కర్లు ఉన్నారు. వీరికి నెలకు వచ్చే జీతం రూ.10 వేలు మాత్రమే. అందులో కొంత కేంద్రం, కొంత రాష్ట్రం ఇస్తుంది. కానీ వీరికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గం టల వరకూ విలేజ్‌ క్లినిక్‌లు, సచివాలయాల వద్ద విధులు కేటాయిస్తున్నారు.ఇతర పనులకు ఉపయోగిస్తున్నారు. ఉదయం , సాయంత్రం కూడా రిజిష్టర్‌లో సంతకాలు చేయించుకుంటున్నారు. ప్రజలకు ఇంత సేవ చేస్తున్నా కనీసం వేతనం, ఇతర సౌకర్యాలు లేక ఆశావర్కర్లు నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. కొంత కాలం కిందట రంపచోడవరంలో నిరసనలు తెలిపారు. ఇవాళ సీఐటీయూ పిలుపు మేరకు ఛలో విజయవాడకు కదిలారు.

వారి డిమాండ్‌లు ఇవే

కనీస వేతనాలు పెంచాలి. కమ్యూనిటీ హెల్త్‌ వర్క ర్లను ఆశాలుగా మార్పు చేయాలి. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవ్‌, వేతనంతో కూడిని మెటర్నిటీ లీవ్‌ అమలు చేయాలి.సంబంధంలేని పనులు చేయించరాదు. నాణ్యమైన సెల్‌ఫోన్లు ఇవ్వాలి. శిక్షణ ఇవ్వాలి. రికార్డ్స్‌ ప్రభుత్వమే ఇవ్వాలి. రికార్డ్సు లేదా ఆన్‌లైన్‌ పనివిషయంలో ఒక పనిని ఒకసారే చేయించాలి. రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. ఏ కారణంతో మరణించినా మట్టి ఖర్చులు ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5లక్షలు ఇవ్వాలి. 62 ఏళ్ల రిటైర్మెంట్‌ జీవోను వర్తింపజేయాలి. రిటైర్మెంట్‌ అయిన వారు, మరణించిన వారి కుటుంబాలలో అర్హులను ఆశాలుగా తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిం పజేయాలి. కొవిడ్‌ కాలంలో మరణించిన ఆశాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి. రూరల్‌లో 1000 నుంచి 1200 మంది. పట్టణాల్లో 2000 నుంచి 2500 మంది జనాభాకు ఒకరి వంతున నియమించాలి. ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ ఇవ్వాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. రాజకీయజోక్యం తొలగించాలి. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ట్రైనింగ్‌ పొందిన ఆశా వర్కర్లను ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీలు, స్టాఫ్‌ నర్స్‌ నియామకాల్లో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలి.

300 మంది అరెస్టు...

‘చలో విజయవాడ’ కార్యక్రమానికి బయలుదేరిన ‘ఆశా’ మహి ళలకు మళ్లీ అడుగడుగునా నిరాశే మిగిలింది. నిర సనకు అనుమతిలేదంటూ జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యక ర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తెల్లవారు జాము నుంచే పోలీసులు మోహరించారు. వాహనాలనూ తనిఖీ చేసిన పోలీసులు ఆశాలని అనుమానం వస్తే దించి వేశారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ ఆశావర్కర్లు వైసీపీ ప్రభుత్వం మీద తిరుగుబావుటా ఎగరవేశారు. కనీస వేత నాలు ఇవ్వాలనే డిమాండ్‌తోపాటు మొత్తం 12 డిమాం డ్లతో గురువారం ఛలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధం అయ్యారు. పోలీసులు అందరికీ నోటీసులు ఇవ్వడంతో పాటు, కొందరిని గృహనిర్బంధం చేశారు. నోటీసులను లెక్కచేయకుండా విజయవాడ బయలుదేరిన మహిళలను ఎక్కడికక్కడే ఆపేసి పోలీస్‌స్టేషన్లకు తర లించారు. రాజ మహేంద్రవరం రైల్వేస్టేషనుకు తూర్పుగోదావరితో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి గురువారం ఉదయం ఆశా లు చేరుకున్నారు.వాళ్లను రైళ్లు ఎక్కకుండా టూటౌన్‌, ప్రభు త్వ రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 66 మంది ఆశాలను రైల్వే స్టేషను సమీపంలోని ఓ కల్యాణ మండపా నికి తరలించారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 300 మందికిపైగా ఆశా వర్కర్లను పోలీ సులు అరెస్టు చేశారు.సాయంత్రం వరకూ ఎవరినీ వెళ్లనీయకుం డా పోలీసులు కాపలా ఉన్నారు. ఇళ్లకు వెళతామని ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి వెళ్లబోమని ఆశాల దగ్గర నుం చి సంతకాలు తీసుకొని సొంత పూచీకత్తుపై పంపించేశా రు.అయినా ఆందోళనకారులు లెక్కచేయలేదు. పోలీ సుల ఎదుటే సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఆశా వర్కర్లు ఆందోళనకు దిగడంతో ప్రజలకు వారు అం దించే సేవలు ఆగిపోయాయి.

జగన్‌కు బుద్ధి చెబుతాం..

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 8 : చలో విజయవాడకు బయలుదేరిన ఆశా వర్కర్లపై జగన్‌ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి చేపట్టిన అరెస్టులు, నిర్బంధాలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం ఆశా వర్కర్లు రాజమహేంద్రవరం శ్యామలా సెంటర్లో నిరసన ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కనీస వేతనం రూ.25 వేలు చెల్లించాలని, యాప్స్‌ పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తమకు వర్తింప చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడుతూ సచివాలయ పోలీసులను ఆశా వర్కర్ల ఇళ్లకు పంపించి వారిని పోలీస్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. జగన్మోహనరెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు కురిపించారని, సీఎం అయ్యాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గణపాఠం చెబుతాన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కేఎస్‌వీ రామచంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌ మూర్తి, సీపీఎం నగర కార్యదర్శి బి.పవన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వి.రాంబాబు, ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాణి, జయలక్ష్మి పాల్గొన్నారు.

కొవ్వూరులో హైవేపై అడ్డగింత

250 మందిని నిర్బంధించిన పోలీసులు

కొవ్వూరు, ఫిబ్రవరి 8 : వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆశా వర్కర్లు ప్రతినబూ నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి విజయవాడ తరలివెళ్తున్న ఆశా వర్కర్లను కొవ్వూరు గామన్‌బ్రిడ్జి టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనకాపల్లి, పార్వతీపురం, విశాఖపట్నం, నర్సీపట్నం, గోకవరం ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ తరలివెళ్తున్న మూడు టూరిస్ట్‌ బస్సులు, 1 తుఫాన్‌ వాహనం, రెండు మహీంద్ర ఆటోలతో పాటు, ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరిన సుమారు 250 మంది ఆశా వర్కర్లను తెల్లవారుజామున 3,4 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. కొవ్వూరు ఆర్యవైశ్య కల్యాణ మండపం లో నిర్బంధించారు.చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అను మతి లేదని వారందరిని తిరిగి వెనక్కి పం పించి వేశారు. సానుకూలంగా నిరసన తెలపడానికి వచ్చిన మహిళలను మహిళా పోలీసులు లేకుండా మగ పోలీ సులే నిర్బంధాలకు గురి చేయడం సరికాదన్నారు.

నిడదవోలు రైల్వే జంక్షన్‌లో..

నిడదవోలు, ఫిబ్రవరి 8 : ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా కార్య కర్తలు అడ గడంతో వారిని అక్రమ అరెస్ట్‌లు చేశారని సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిడదవోలు రైల్వే స్టేషన్‌ నుంచి గురు వారం ఆశా కార్యకర్తలు ఛలో విజయవాడ కార్యక్ర మానికి వెళుతుండగా చాగల్లు, నిడదవోలు పట్టణ మండల గ్రామాలకు చెందిన సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి సమీపంలోని తాలూకా రైస్‌ మిల్లర్స్‌ హాలుకు తరలించారు. అనంతరం పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై ఆశాలను విడుదల చేశారు.

మేము ఎలా బతకాలి సారూ...

సీతానగరం,ఫిబ్రవరి 8 : మాకు నెలకు ప్రభుత్వం ఇచ్చే జీతం పది వేలు. ప్రభుత్వం అప్పగించిన పనులు చేయడానికి సగం జీతం అయిపోతోంది. 24 గంటలు పనిచేయాలని చెబుతున్నారు. ఇంక మేం ఎలా బతకాలి సార్‌.. అం దుకే మా న్యాయమైన డిమాండ్ల సాధనకు ధర్నాకు వెళుతున్నాం.. మీరు అరెస్టుచేస్తే చేసుకోండి.. ఎక్కడికి తీసుకువెళతారో తీసుకెళ్లండి మేము మాత్రం ఎక్కడ ఉంటే అక్కడే మహాధర్నాకు సంఘీభావం తెలుపుతామని ఎస్‌ఐకు తెలిపారు. సీతానగరం మండల ఆశ వర్కర్ల యూనియన్‌ ఆధ్యక్షురాలు కుమారి మాట్లాడుతూ ప్రభుత్వోగులమని మాకు అన్ని ప్రభుత్వ పథకాలు కట్‌చేశారు. మాకు ప్రభుత్వం నుంచి ఏవిధమైన లబ్ధి లేకుండా చేశారు. చేసిన పనికి సరిపడా జీతం కోరుతున్నాం. సీఎం జగన్‌కు ప్రజల గురించి ఆలోచించే సీఎం అయితే మా గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.

Updated Date - Feb 09 , 2024 | 01:09 AM