సీటు..హీటు!
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:49 AM
సీట్లు సిగపట్లు తప్పడం లేదు.. తొలిజాబితా విడుదల కావడంతో మిగిలిన నియోజకవర్గాల ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.. సోమవారమే మరో జాబితా విడుదలవుతుందనే సమాచారంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కం ఠ నెలకొంది..ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారనేది దానిపై లెక్కల్లో మునిగితేలుతున్నారు..
నిడదవోలులో మారనున్న సీన్
నిడదవోలు నుంచి కందుల దుర్గేష్?
రూరల్ నుంచి గోరంట్లే?
త్వరలో అధికారిక ప్రకటన
నిడదవోలు టీడీపీ నేతల్లో అలజడి
మిగిలిన మూడు స్థానాల్లో తీవ్ర పోటీ
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
సీట్లు సిగపట్లు తప్పడం లేదు.. తొలిజాబితా విడుదల కావడంతో మిగిలిన నియోజకవర్గాల ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.. సోమవారమే మరో జాబితా విడుదలవుతుందనే సమాచారంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కం ఠ నెలకొంది..ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారనేది దానిపై లెక్కల్లో మునిగితేలుతున్నారు.. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాలో సీట్లు సాధించిన అభ్యర్థులు ఉత్సాహంగా పోటీలో దిగగా.. ఇంకా టిక్కెట్లు కేటాయించిన నియోజకవర్గాల్లో మాత్రం తీవ్ర టెన్షన్ నెలకొంది..జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా శనివారం ప్రకటించిన జాబితాలో ముగురికి చోటిచ్చారు. ఇంకా నాలుగు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. వైసీపీలోనూ జిల్లాలో ఇంకా మూడు స్థానాలు ప్రక టించాల్సి ఉంది. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఏం జరుగుతోంది..
రాజమహేంద్రవరం రూరల్ సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే,టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ పట్టుపట్టి కూర్చున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీటు గ్యారంటీ అని చెప్పిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తొలి జాబితాలో మొదట రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరును చేర్చినట్టు సమాచారం. కానీ రూరల్ విషయంలో కందుల దుర్గేష్‌కు స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరుపార్టీల అధినేతలు వారి వారి అభ్యర్థులకు హామీ ఇవ్వడంతో రాజమహేంద్రవరం రూరల్ సీటుపై తర్జనభర్జన పడు తున్నారు. ఇద్దరినీ కూర్చొపెట్టి సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఇద్దరికీ పోటీ చేసే అవకాశం ఇద్దామని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒకరికి రూరల్ కేటాయించి, వేరే చోట మరొకరికి కేటాయిద్దామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవకాశం ఇచ్చి, జిల్లాలో మిగిలిన మరో జన రల్ స్థానం నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపడానికి నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. కందుల దుర్గేష్‌కు జనసేన వర్గాలు నచ్చచెబుతున్నట్టు సమాచారం. కొందరైతే రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని సలహాలు ఇచ్చినా దానికి ఆయన అంగీకరించలేదని తెలిసింది. ఇంకా రూరల్ సీటు మీదే ఆయన నమ్మకం పెట్టుకున్నారు.ఈ వారంలోనే సీటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే నిడదవోలు టీడీపీ వర్గాల్లో అలజడి మొదలైంది. అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సీనియర్ నేత కుందుల సత్యనారాయణ టికెట్ కోసం త్రీవంగా పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరినీ కాదని జనసేనకు ఇస్తారనే సమాచారంతో ఆదివారం సాయంత్రం నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే శేషారావు ఇంటికి వెళ్లారు. కానీ శేషారావు మాత్రం తనకు ఇంత వరకూ అధిష్ఠానం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని..ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పడం గమనార్హం. కుందుల సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండడంతో ఆయనకు పలువురు ఫోన్‌లు చేసి పరిస్థితిని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అధిష్ఠానం నిడదవోలు సీటు జనసేనకు ఇవ్వ డానికి నిర్ణయిస్తే అక్కడి నేతలతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలకు ఇక ఎన్నో రోజులు లేవు. త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఈ సీట్ల విషయం త్వరగా తేలిపోతే ప్రజల్లో మరింతగా పనిచేసుకోవాలనే ఆలోచనతో ఆశావహులు ఉన్నారు. త్వరలో టీడీపీ, జనసేన అధినేతలు ఈ సీట్ల విషయంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక జిల్లాలో ఇప్పటికే మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డివాసు, అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నుంచి బత్తుల బలరా మకృష్ణలను ఉమ్మడి అభ్యర్థులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ జనసేన టీడీపీ ఐక్యత కనిపించింది. రాజ మహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డివాసుకు అనుశ్రీ సత్యనారాయణ, అన పర్తిలో రామకృష్ణారెడ్డికి మర్రెడ్డి శ్రీనివాసరావు జనసేన నాయకులు అండగా నిలబడుతున్నారు.అదే విధంగా రాజానగరంలో బత్తుల బలరా మకృష్ణకు టీడీపీ నాయకుడు బొడ్డు వెంకట రమణచౌదరి అండగా ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లోనూ పొత్తు ఽధర్మంలో భాగంగా నాయ కులు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇంకా టీడీపీ నాలుగు చోట్ల అభ్యర్ధులను ఖరారు చేయనుంది. రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించ నుంది. గోపాలపురం అభ్యర్థిగా మద్దిపాటి వెంకట్రాజు పేరు ఖరారైనట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొవ్వూరులో మాత్రం అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కెఎస్ జవహర్ ఆశిస్తున్నారు. ఒక వర్గం గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేరుతో పాటు మరికొన్ని పేర్లు సూచిస్తున్నట్టు గమనార్హం. టీడీపీ మూడు చోట్ల ప్రక టించింది. అయితే ఇరుపార్టీలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గం రాజమహేంద్రవరం అర్బన్ మాత్రమే. ఈ నియోజకవ ర్గంలో టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు, వైసీపీ నుంచి ఎంపీ మార్గాని భరత్ బరిలో ఉన్నారు.ఈ ఇద్దరి మధ్యే ఇక్కడ పోటీ జరగనుంది. ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేసినా ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే ఉంటుంది. ఇక ఇరుపార్టీలు అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాలు ఏమీ లేవు. సోమవారం ఆయా నియోజకవర్గాల సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.
కొనసాగుతున్న పాటంశెట్టి నిరసన దీక్ష
గోకవరం, ఫిబ్రవరి 25 : జగ్గంపేట జనసేన ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర దంపతుల నిరసన దీక్ష కొనసాగుతోంది. టీడీపీ, జన సేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేరును ప్రకటించడం పట్ల జన సేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన అంతిమ ఆమ రణ నిరహార దీక్ష పేరుతో గోకవరం మండలం అచ్చుతాపురం కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం రాత్రి నుంచి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.ఆహార పానీయాలను దరి చేరనీయకుండా ఆల యంలోనే సూర్యచంద్ర, ఆయన సతీమణి శనివారం రాత్రి నుంచి దీక్ష కొనసాగించడంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమా చారం. సూర్యచంద్ర సీటు నిరాకరణకు గల కారణాలను రానున్న 48 గం టల్లో వివరించాలని జనసైనికులు కోరుతున్నారు.
నిడదవోలు నుంచి పోటీ చేయమన్నారు..
అధిష్ఠానం పిలుపు ఇచ్చింది..
కార్యకర్తలతో మాట్లాడి వెల్లడిస్తా
జనసేన నేత కందుల దుర్గేష్
నిడదవోలు నుంచి పోటీ చేయమని జనసేన అధిష్ఠానం నాకు చెప్పడం వాస్తవమే.నేనింకా కార్యకర్తలు, పార్టీనేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. రాజమహేంద్రవరం రూరల్ జనసైనికులకు, వీరమహిళలకు నమ స్కారం చెబుతూ, కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన పార్టీ అధినాయ కత్వం రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తుందన్నారు.అది ఏ రకమైన నిర్ణయమైనప్పటికీ కూడా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆవేశకావే శాలకు లోనుకావొద్దన్నారు. మనం ముఖ్యంగా సుక్షితులమైన సైనికుల మాదిరిగా పనిచేస్తున్నవాళ్లం.. ఎట్టిపరిస్థితులోనూ మనం సంయమ నాన్ని కోల్పోవద్దని కోరారు.అంతా మంచే జరుగుతుందని, మన పార్టీని విజయం దిశగా తీసుకుని వెళ్లే విధంగా పనిచేయాలని కోరారు. పవన్‌కల్యాణ్ కూడా స్వయంగా చెప్పినట్టు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయనతో మాట్లాడుతూ మన వాళ్లు పరిస్థితులను చక్కదిద్ది, అక్కడ నుంచి గెలిపిస్తారని కూడా ఆయనకు చెప్పినట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో దుర్గేష్ జనసైనికులు, కార్యకర్తలు, తన శ్రేయాభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.