ఆటో-బైక్ ఢీ: ఇద్దరి మృతి
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:39 AM
: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల శివారు చౌదరిపురం సమీపంలో గురువారం ఆటో బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైనట్టు ఎస్‌ఐ డి.జ్వాలా సాగర్ తెలిపారు.
కొత్తపేట, ఫిబ్రవరి 1: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల శివారు చౌదరిపురం సమీపంలో గురువారం ఆటో బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైనట్టు ఎస్‌ఐ డి.జ్వాలా సాగర్ తెలిపారు. వివరాల ప్రకారం... రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన చీమల మాధవరావు (43) తండ్రి నరసింహారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై కొత్తపేట మండలం వాడపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పలివెల మీదుగా ముమ్మిడివరప్పాడు బయల్దేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన ఆటో డ్రైవర్ బండి మోషే (35) ప్రయాణికులు లేని ఆటోతో పలివెల సమీపంలోని కూలీలను ఎక్కించుకునేందుకు వస్తున్నాడు. చౌదరిపురం సమీపంలో మాధవరావు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో డ్రైవర్ నేరుగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న మాధవరావు, ఆటో నడుపుతున్న మోషే అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన నరసింహారావును మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాధవరావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జ్వాలాసాగర్ తెలిపారు.