Share News

ఊరూరికి బెల్టు షాపులు

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:39 AM

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సు ఫీజులు భారీగా పెరగడంతో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు బెల్టు షాపులకు తెరతీశారు. దుకాణాలు లేని చోట ముఖ్య కూడళ్లకు సమీపంలోను, గ్రామాల్లోను బెల్ట్‌షాపులను ఏర్పాటు చేయించారు.

ఊరూరికి బెల్టు షాపులు

రావులపాలెం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సు ఫీజులు భారీగా పెరగడంతో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు బెల్టు షాపులకు తెరతీశారు. దుకాణాలు లేని చోట ముఖ్య కూడళ్లకు సమీపంలోను, గ్రామాల్లోను బెల్ట్‌షాపులను ఏర్పాటు చేయించారు. మద్యం దుకాణం దక్కించుకున్న వారే బెల్టు షాపు ఇవ్వడంతో ఇక బెల్టు షాపు నిర్వాహకులు ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఏకంగా సిట్టింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి తాగిస్తున్నారు..బహిరంగంగానే రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్‌ మద్యంతో ప్రజారోగ్యాన్ని గుల్ల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీ మేరకు కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. దీంతో ప్రైవేటు మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు వ్యాపారాన్ని విస్తరించేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. దుకాణాలు లేని శివారు ప్రాంతాలను సైతం మద్యం విక్రయాలు సాగించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే విస్తారంగా బెల్ట్‌షాపులను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా దాబా, రెస్టారెంట్లలోను నిబంధనలకు విరుద్ధంగా దర్జాగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. రావులపాలెం శివారు ప్రాంతాల్లోను, దేవరపల్లి, గోపాలపురం, ఈతకోటలో ప్రధానంగా బెల్టు షాపులు వెలిశాయి..

Updated Date - Oct 24 , 2024 | 12:39 AM