స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలి
ABN , Publish Date - Sep 25 , 2024 | 12:30 AM
వ్యవసాయ ఆధారిత అనుబంధ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్యర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.
అమలాపురం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఆధారిత అనుబంధ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్యర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మాట్లాడుతూ 2024-25 వార్షిక రుణ ప్రణాళిక ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ రంగాలకు కలిపి రూ.14,259 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.5965 కోట్ల మేర రుణాల కల్పన లక్ష్యాన్ని ఛేదించారన్నారు. ప్రతీ బ్యాంకు మేనేజర్ తమకు నిర్దేశించిన వార్షిక రుణ లక్ష్యాలను చేరుకోవాల్సిందిగా సూచించారు. గత సమావేశంలోని మినిట్స్‌పై తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. తొలుత ఎల్డీఎం వర్మ జీవనోపాధుల పెంపు, గ్రామీణ శిక్షణ కార్యక్రమాలు, వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం, మత్స్య పశుసంవర్థక శాఖలో రుణాలతో ముడిపడి ఉన్న పథకాల తీరు తదితర అంశాలపై ప్రస్తావించారు. రుణాల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి అర్హులకు మేలు జరిగేలా చూడాలని అధికారులు సూచించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం హనుమకుమారి, యూబీఐ రీజనల్ మేనేజర్ సాయిమనోహర్, డీఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకరప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు, పశుసంవర్థకశాఖ అధికారి వెంకట్రావు, నాబార్డు ఏజీఎం స్వామినాయుడు, జీఎం ప్రసాద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.