Share News

సదుపాయాల గుర్తింపునకు చెక్‌లిస్ట్‌

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:48 AM

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను చెక్‌లిస్టు ఆధారంగా గుర్తించి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. 84 ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, చైల్డ్‌కేర్‌ సెంటర్‌లలో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం తదితర సమస్యలను గుర్తించేందుకు ఒక్కో వసతిగృహానికి ప్రత్యేక అధికారితో పాటు ఇంజనీర్‌ను నియమించామన్నారు.

సదుపాయాల గుర్తింపునకు చెక్‌లిస్ట్‌

అమలాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను చెక్‌లిస్టు ఆధారంగా గుర్తించి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. 84 ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, చైల్డ్‌కేర్‌ సెంటర్‌లలో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం తదితర సమస్యలను గుర్తించేందుకు ఒక్కో వసతిగృహానికి ప్రత్యేక అధికారితో పాటు ఇంజనీర్‌ను నియమించామన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, మరమ్మతులు, మెనూ అమలులో లోపాలు వంటి వాటిని చెక్‌లిస్టు ఆధారంగా గుర్తించాలన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 500కు పైగా ఉద్యోగులు ఉంటే కార్యనిర్వాహక ఇంజనీర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించి చెక్‌ లిస్టు ఆధారంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. చిల్డ్రన్‌ కేర్‌ సెంటర్‌కు 21 మంది ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లతో పాటు ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. చెక్‌లిస్టు ఆధారంగా గుర్తించిన సమస్యలన్నింటినీ క్రోడీకరించి అంచనాలు రూపొందించాలని సూచించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత, ఇతర నిధులతో ఆయా పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రన్నింగ్‌ వాటర్‌తో మరుగుదొడ్లు, కిచెన్‌ సమస్యలు, మెనూ నాణ్యత వంటి వాటితో దోమతెరలు, శ్లాబ్‌ లీకేజీలు, పైపులైన్లు, ఫ్యాన్లు, లైట్లు వంటి ఇతర అంశాలను కూడా గుర్తించి ఈ నెల 23నాటికి నివేదిక అందించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సంక్షేమ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. నాణ్యమైన విద్యాబోధన అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో వి.మదన్‌మోహనరావు, డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, డీపీవో డి.శాంతలక్ష్మి, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌తో పాటు అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:48 AM