15 శాతం వృద్ధిరేటే లక్ష్యంగా స్వర్ణాంధ్ర-2047
ABN , Publish Date - Dec 12 , 2024 | 12:27 AM
15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలు అమలుచేసి సత్ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతీ పథకం కార్యాచరణ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
అమలాపురం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలు అమలుచేసి సత్ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతీ పథకం కార్యాచరణ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. అమరావతిలో జిల్లా కలెక్టర్లతో బుధవారం ప్రారంభించిన సమావేశ వీడియో కాన్ఫరెన్సును జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో వీక్షించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-2047 సాధనకు అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధి రేటు సాధనపై కలెక్టర్లు శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో ప్రజల భూ హక్కులు కాపాడి భూ వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త ఉండే విధంగా వివిధ పథకాలు వర్తింప చేయాలన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అభివృద్ధి అవకాశాల కల్పనతో సంపదను సృష్టించి పేద వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యాక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతీ ఇంటినుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సృజనాత్మకతను వెలికి తీస్తూ నూతన ఆవిష్కరణలతో అభివృద్ధికి పట్టం కట్టే రీతిలో పునాదులు వేయాలన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంగా పనిచేస్తూ సుస్థిరాభివృద్ధిని సాధించాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు డిజిటల్ పరిపాలన వంటి సాంకేతికతను వినియోగించి సుపరిపాలన దిశగా ముందుకు సాగాలన్నారు. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రజలకు సురక్షిత జీవనం కల్పించాలన్నారు. స్వర్ణాంధ్ర -2047 సాధనకు సమ్మిళిత అభివృద్ధికి ఈ నెల 13న విజయవాడలో విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తామని ప్రకటించారు. కలెక్టర్లు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా గంజాయి, డ్రగ్స్ సరఫరా వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. మెగా డీఎస్సీ అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా అమలు పరచాలన్నారు. సంక్రాంతి నాటికి పల్లె పండుగ పేరుతో ప్రారంభించిన పనులను పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సును ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.ఝాన్సీరాణి, డీఎల్డీవో త్రినాథరావు తదితరులు వీక్షించారు.