సహకార ఎన్నికలకు కసరత్తు
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:56 PM
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కూటమి నాయకులలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 166 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండటంతో వీటిలో ముగ్గురు సభ్యులను నియమించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాలక వర్గాలను దక్కించుకోవడం కోసం నియోజకవర్గ శాసన సభ్యుల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు.
కోనసీమ జిల్లాలో 166 సహకార సంఘాలకు కమిటీలు
ఆలమూరు/ఆత్రేయపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కూటమి నాయకులలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 166 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండటంతో వీటిలో ముగ్గురు సభ్యులను నియమించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాలక వర్గాలను దక్కించుకోవడం కోసం నియోజకవర్గ శాసన సభ్యుల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు. త్రిసభ్య కమిటీ ముగ్గురిలో ఒకరికి అధ్యక్ష పీఠం దక్కనున్నది. దీంతో పదవులు దక్కించుకోవడం కోసం కూటమి నాయకులు ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో సహకార సంఘాల పాలక మండలికి పదవి కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించకుండా దాదాపు నాలుగేళ్ల పాటు త్రిసభ్య కమిటీలతో కాలక్షేపం చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సమయం తీసుకుని తదుపరి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో ప్రస్తుతం వచ్చే నెల 15 నాటికి త్రిసభ్య కమిటీలను నియమించాలని నిర్ణయం తీసుకుని త్రిసభ్య కమిటీలకు రంగం సిద్ధం చేసింది. దీంతో నియోజకవర్గాలలో ఉన్న సహకార సంఘాలను దక్కించుకోవడం కోసం నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వ ఒప్పందాలలో భాగంగా ఏఏ సంఘాలు టీడీపీకి జనసేన, బీజేపీలకు కేటాయించాలనే విషయంపై నియోజకవర్గ నాయకులతో జోరుగా మంతనాలు సాగుతున్నాయి. జిల్లాలో 166 సహకార సంఘాలు ఉండటంతో టీడీపీకి వందకు పైగా సంఘాలు, దాదాపు 50 సహకార సంఘాలు జనసేనకు మిగిలిన సంఘాలు బీజేపీకి రానున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయకులు ఆయా పదవులను దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘాలకు ఎన్నికైన అధ్యక్షులకు జిల్లా సెంట్రల్ బ్యాంక్, డీసీఎంఎస్‌లలో పదవులు రానున్నాయి. అందువల్ల ఈ పదవులను దక్కించుకుని జిల్లాస్థాయి పదవులను పొందవచ్చునని సహకారంపై వాలేందుకు నాయకులు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలోని 166 సహకార సంఘాలలో దాదాపు 500 మందికి పదవులు రానున్నాయి.