Share News

పంట దెబ్బతిన్న రైతులు సూచనలు పాటించాలి

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:16 AM

తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాల నుంచి పంట నష్టాన్ని అధిగమించేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.నందకిశోర్‌ సూచించారు. సకాలంలో రైతులు చర్యలు చేపట్టడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోగలరన్నారు.

పంట దెబ్బతిన్న రైతులు సూచనలు పాటించాలి

ముమ్మిడివరం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాల నుంచి పంట నష్టాన్ని అధిగమించేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.నందకిశోర్‌ సూచించారు. సకాలంలో రైతులు చర్యలు చేపట్టడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోగలరన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరిని వర్షాలు పూర్తయ్యేవరకు కోతలు కోయకుండా వాయిదా వేసుకోవాలన్నారు. కోసిన వరి ఆరని పనలను తుఫాను వాతావరణ నేపథ్యంలో కుప్పలుగా వేసేటప్పుటు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పలు వేసుకోవాలన్నారు. కోతకోసి పొలాల్లో ఉన్న వరి పనలు తడిసినట్టయితే గింజలు మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పిచికారీ చేయాలని, పొలంలో నీరు నిలిచి ఉన్నట్టయితే పనలను గట్టుపైకి తీసుకువచ్చి ఉప్పు ద్రావణాన్ని చల్లుకోవాలన్నారు. వర్షాలు తగ్గి ఎండలు రాగానే వరి పనలను ఆరబెట్టి నూర్చుకోవాలన్నారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలని, రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేకపోతే గింజలు మొలకెత్తడమే కాకుండా రంగులు మారే ప్రమాదం ఉందన్నారు. నష్టాన్ని నివారించేందుకు ఒక క్వింటా ధాన్యానికి కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊకను కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజలు మొలకెత్తకుండా, పాడవకుండా నివారించుకోవచ్చునన్నారు. ఎండ వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎండబెట్టి నిల్వ చేసుకోవాలన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి అందుకోవడం వల్ల కొంత వరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చునన్నారు. గింజ గట్టిపడే దశ నుంచి వరి కోత దశలో చేను పడిపోకుండా ఉండి నిద్రావస్థ కలిగిన రకాలకు నష్టం తక్కువగా ఉంటుందన్నారు. నిద్రావస్థ లేనటువంటి బీపీటీ 5204 వంటి రకాలు నీట మునిగితే గింజలు మొలకెత్తి ఎక్కువ నష్టం కలుగుతుందన్నారు. నిద్రావస్థలో ఉన్న రకాలు కూడా చేలు పడి ఎక్కువరోజులు నీట మునిగి ఉంటే మొలక వచ్చే అవకాశం ఉందని వాటి నివారణకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని చేనుపై పిచికారీ చేసుకోవాలన్నారు. గింజ గట్టిపడే దశలో వరి వెన్ను బరువు వల్ల మొక్కలు కొద్దిపాటి గాలి, వర్షాలకే నేలకొరుగుతాయని దీనివల్ల గింజలు సరిగా తోడుకోక పాలు గింజలుగా ఏర్పడి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. అటువంటి వాటి వల్ల ధాన్యం రంగుమారి, మిల్లింగ్‌ సమయంలో విరిగిపోయి బియ్యంపై మచ్చలు వచ్చే అవకాశం ఉందన్నారు. పడిపోయిన వరిచేనును యంత్రాలతో కోయడానికి ఎక్కువ సమయం పడుతుందని, దీనివల్ల ఖర్చు పెరుగుతుందన్నారు. ఈ నష్టాన్ని నివారించేందుకు వరి దుబ్బులను పైకి లేపి నిలబెట్టి కట్టలుగా కట్టే చర్యలు చేపట్టాలన్నారు. దాళ్వా నారుమడి దశలో ఉన్న వరిపంటకు సంబంధించి విత్తనం చల్లి రెండు, మూడు రోజులైతే మొలక శాతం తగ్గుతుందని, వీలైనంత త్వరలో నీటిని పూర్తిగా బయటికి తీసివేయడం వల్ల విత్తనం కోర గాలి తగిలి నష్టం జరగకుండా ఉంటుందన్నారు. నీరు బయటికి తీయడానికి వీలులేకపోతే మొలక దెబ్బతిని తిరిగి మళ్లీ విత్తనం చల్లుకోవాల్సి ఉంటుందన్నారు. విత్తనం చల్లి ఏడు నుంచి 30 రోజుల మధ్యలో నారుమడి ఐదు రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఐదు రోజుల లోపు నీటిని పూర్తిగా బయటకు తీసివేసి గాలి తగిలేలా చూసుకోవాలన్నారు. నీటిని తీసివేసిన తర్వాత ఐదు సెంట్ల నారుమడికి కిలో యూరియా, ఒక కిలో పొటాష్‌ వేసుకోవడం వల్ల నారు దృఢంగా పెరుగుతుందన్నారు. వర్షాల వల్ల నారుమడుల దశలో పంట తెగుళ్ల బారిన పడకుండా నీటిని పూర్తిగా తీసివేసి మొక్క నిలదొక్కుకున్న తర్వాత లీటరు నీటికి ఒక గ్రాము కార్బన్డిజం, రెండు గ్రాముల కార్బన్డిజంతో పాటు మ్యాంగో జెబ్‌ కలిపి మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలన్నారు. పొలంలో నిలిచిన నీటిని మురుగు కాల్వల ద్వారా బయటికి వెళ్లేందుకు బాటలు వేసుకోవాలన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:16 AM