పంట రాబడిలో 60 శాతం వరకు రుణం పొందేలా పరిమితులు నిర్ధారించాలి
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:17 AM
జిల్లాలో సాగులో ఉన్న వివిధ పంటల రాబడిలో 60 శాతం వరకు రుణాన్ని పొందేవిధం గా రుణ పరిమితులను నిర్ధారించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు.
అమలాపురం, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగులో ఉన్న వివిధ పంటల రాబడిలో 60 శాతం వరకు రుణాన్ని పొందేవిధం గా రుణ పరిమితులను నిర్ధారించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ 2025-26 సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి రుణ పరిమితులను జిల్లా స్థాయిలో సాంకేతిక కమిటీ ప్రతిపాదించిందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, కొబ్బరిలో అంతరపంటలైన అరటి, కూరగాయలు, పాడి, కోళ్ల పరిశ్రమ, మత్స్యసాగు కార్యకలాపాలు చేపట్టే రైతులకు ఉత్పాదక వ్యయం, నర్సరీ వర్కింగ్ క్యాపిటల్, రాబడులు ఆధారంగా బ్యాంకుల ద్వారా అందించే రుణ పరిమితులను ఆయా శాఖల జిల్లా అధికారులు కమిటీకి వివరించారు. ఉత్పాదక వ్యయంలో కనీసం 60 శాతం పంట రుణాలుగా అందించేందుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితులను కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రధానంగా వరి పంటకు సంబంధించి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.49,820, రబీలో రూ.56,262 రుణ పరిమితులుగా నిర్ణయించారు. అనుబంధ రంగాలకు సంబంధిం చి ఉత్పాదక వ్యయాలు, రాబడులను మరోసారి నిశితంగా పరిశీలించి రుణ పరిమితులను నిర్ధారిస్తూ రాష్ట్ర స్థాయి కమిటీకి సిఫార్సు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పశుసంవర్ధ కశాఖ ద్వారా లబ్ధిదారులకు ఒక్కో పాడి గేదె కు రూ.లక్షా 20వేలు, పాడి ఆవులకు రూ.లక్ష వర్కింగ్ క్యాపిటల్‌గా నిర్ణయించారు. జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితుల ప్రతిపాదనలను క్రోడీకరించి రాష్ట్ర కమిటీ ఆమోదానికి పంపాలని అధికారులకు సూచించారు. మొక్కజొన్న రబీలో సాగుకు ఎకరాకు రూ.35,850, పప్పు దినుసులు సాగుకు ఎకరాకు రూ.22,700 రు ణ పరిమితిని ప్రతిపాదించామన్నారు. పూల సాగుకు రుణ పరిమితులు నిర్ణయించడం జరిగిందని, మేజర్ క్రాఫ్ ఫిష్ ప్రొడక్షన్‌కు రూ.2.50 లక్షల వరకు రుణ పరిమితిగా తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. కొబ్బరి, అరటి సాగుకు మరోసారి అధ్యయనం చేసి రుణ పరిమితులను నిర్ధారించాలన్నారు. సమావేశంలో డీసీసీబీ కార్యనిర్వాహక అధికారి ఆర్వీ నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వెంకట్రావు, మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, ఉద్యాన అధికారి బీవీ రమణ, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ స్వామినాయుడు, లీడ్‌బ్యాంకు మేనేజర్ కేశవవర్మ, ఎస్‌బీఐ అధికారులు పాల్గొన్నారు.