Share News

జిల్లా ఆసుపత్రి సంగతేంటి!

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:16 AM

జిల్లా విభజన జరిగింది.. మెడికల్‌ కళాశాల ఏర్పాటైంది.. అయితే జిల్లా ఆసుపత్రిపై మాత్రం నేటికీ మీమాంస నెలకొంది..గత వైసీపీ ప్రభుత్వం నేడు.. రేపు అంటూ నెట్టుకొచ్చేసింది. ఎటువంటి కదలిక లేదు.

జిల్లా ఆసుపత్రి సంగతేంటి!
జీజీహెచ్‌ ఆసుపత్రి

కొవ్వూరులో ఏర్పాటు చేస్తారని వాదన

జీజీహెచ్‌లో అవినీతి రోగం.. రోగుల ఇక్కట్లు

నేడు వైద్య శాఖ మంత్రి రాక

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 7 : జిల్లా విభజన జరిగింది.. మెడికల్‌ కళాశాల ఏర్పాటైంది.. అయితే జిల్లా ఆసుపత్రిపై మాత్రం నేటికీ మీమాంస నెలకొంది..గత వైసీపీ ప్రభుత్వం నేడు.. రేపు అంటూ నెట్టుకొచ్చేసింది. ఎటువంటి కదలిక లేదు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జిల్లా ఆసుపత్రి సంగతి తేల్చాలని జిల్లా వాసులు పట్టుబడుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్‌గా అప్‌గ్రేడ్‌ కావడంతో కొవ్వూరులో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ గత కొన్నేళ్లుగా వినిపిస్తోంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొవ్వూరు, నిడదవోలు, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి తదితర మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో కలవడంతో ఆయా మండలాల నుంచి మెరుగైన వైద్యం కోసం రోగులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో రాజమహేంద్రవరంలో జిల్లా ఆసుపత్రి ఉండేది. ఇప్పుడు జీజీహెచ్‌గా మారడంతో కొవ్వూరులో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనపర్తి లేదంటే కొవ్వూ రులో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారనే వాదనలు విని పించాయి. కొవ్వూరులో సకల సౌకర్యాలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రికి తగినట్టుగా ఏర్పాట్లు ఉన్నాయి. మరో వైపు కొవ్వూరును ఆనుకుని ఉన్న జాతీయ రహదారి ఆసుపత్రి ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. జాతీయ రహదారి మీదనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.అదే విధంగా ఆసుపత్రి ఆవరణ కూడా భారీగా ఉండడంతో దానికే ఓటే శారు. అంతే కాకుండా కొవ్వూరు జిల్లాకు మధ్యస్తంగా ఉం టుంది.అటు నిడదవోలు, గోపాలపురం, ఇటు రాజమ హేంద్ర వరం,రాజానగరం, అనపర్తి ప్రజలకు అందుబాటులో ఉం టుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసు కుంటుందోనని ప్రజానీకం ఎదురుచూస్తున్నారు.

జీజీహెచ్‌లో అవినీతి..

రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు అవినీతి అనే మొండిరోగం పట్టుకుంది. జీజీహెచ్‌లోని జలగలు ప్రతి పనికీ ఒకరేటు పెట్టి పీల్చేయడం నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం ఇక్కడ ఫక్తు కమర్షియల్‌గా మారిపోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, నర్సింగ్‌ ఇలా ఏ విభాగం టచ్‌ చేసినా డబ్బు ... డబ్బు అనే మాట వినిపిస్తోంది. మెరుగైన వైద్యసేవల మాట దేముడెరుగు వైద్య సిబ్బందికి ముడుపులు ఇచ్చుకోలేక సామాన్యులు నరకయాతన పడుతున్నారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే పేదలు, సామాన్యులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలోని కొందరు సిబ్బంది టెస్టులకు డబ్బుల కోసం జలగల్లా పట్టి పీడిస్తుండడంతో జీజీహెచ్‌ పరువు రోడ్డున పడుతోంది. ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలిసినా అదిగో విచారణ వేశాం, నివేదిక వచ్చాక చూద్దాం అంటూ చేస్తున్న ప్రకటనలు విమర్శలకు దారితీస్తున్నాయి. కాలయాపన తప్ప తీసుకున్న చర్యలు లేకపోవడంతో అమ్మో పెద్దాసుపత్రికా.. అంటూ సామాన్య రోగులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, ఎక్స్‌రే, ఆల్ర్టా సౌండ్‌ వంటి టెస్టులకు ప్రజానీకం డబ్బులకు డబ్బులు చెల్లిస్తూనే వైద్యం కోసం మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తోంది.

ఎంఎన్‌వోలపై చర్యలేవి..

జీజీహెచ్‌లో ప్రధానంగా ఎంఎన్‌వో విభాగం అవినీతి ఆరోపణలతో భ్రష్టుపట్టి పోయింది. అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏ కారణం చేతనో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్‌ (ఎంఎన్‌వో)ను ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగించడం విస్మయానికి గురి చేస్తోంది. నర్సింగ్‌ విభాగంలోనూ పలు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ విభాగం బాధ్యులుగా ఉన్న సిస్టర్‌ ఒకరు ఇటీవల తన కిందిస్థాయి నర్సింగ్‌ స్టాఫ్‌తో ఆఫీసు కోసం అంటూ ఏసీ, ప్రింటర్‌, ఫ్రిడ్జ్‌ కొనిపించినట్టు ఆరోపణలున్నాయి. ఐసీయూల్లో సిస్టర్లు విధులు సక్రమంగా నిర్వర్తించడలేదనే ఫిర్యాదులున్నాయి. ఐసీయూలో గత 15 రోజులుగా వైద్యం చేస్తున్నా తమ బంధువులు కోలుకోలేదని, మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరితే ఐసీయూ సిస్టర్లు పేషెంట్‌ డిశ్చార్జి పెట్టారంటూ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి ఒకరు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఓపీ రిజిస్ర్టేషన్లలోనూ సమస్యలున్నాయి. ఎంఎన్‌వోలు, నర్సింగ్‌, ఓపీ, మెడికల్‌ క్యాజువాలిటీ వంటి కీలకమైన విభాగాల్లో అవినీతి పెరగడంతో పేదలు, సామాన్యులు పెద్దాసుపత్రి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

నేడు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పర్యటన

రాజమహేంద్రవరం సిటీ, జూలై 7 : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సోమవారం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 7:40 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ఉదయం 8:50 గంటలకు అనపర్తి చేరుకుంటారు. అనపర్తిలో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:40 గంటల మధ్య వంద పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ భవనానికి శంకుస్థాపన చేస్తారు.ఉదయం 10:30 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటా రు. సాయంత్రం 6 గంటల తర్వాత రోడ్డు మార్గం గుండా బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుంటారు.

Updated Date - Jul 08 , 2024 | 12:16 AM