జిల్లా పోలీసు అధికారులకు ఏబీసీడీ అవార్డులు
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:41 AM
అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును విజయవంతంగా ఛేదించిన జిల్లాకు చెందిన పోలీసు అధికారులకు ఏపీ రాష్ట్ర పోలీసు ఏబీసీడీ అవార్డులను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అందజేశారు. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోని క్రైమ్ నంబరు 181/2024లో నిందితులుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును ఇటీవల జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది.
అమలాపురం టౌన్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును విజయవంతంగా ఛేదించిన జిల్లాకు చెందిన పోలీసు అధికారులకు ఏపీ రాష్ట్ర పోలీసు ఏబీసీడీ అవార్డులను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అందజేశారు. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోని క్రైమ్ నంబరు 181/2024లో నిందితులుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును ఇటీవల జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. నేర పరిశోధనకు, కేసుల సత్వర పరిష్కారానికి అధునాతన విధానాలను అవలంబిస్తూ వినూత్న మార్గాలను అనుసరించిన పోలీసు అధికారులను గుర్తించి వారికి అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డులను బుధవారం మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. కేసును ఛేదించిన ఎస్పీ కృష్ణారావుతో పాటు దర్యాప్తులో పాల్గొన్న అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్, రూరల్ సీఐ పి.వీరబాబు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ వై.శేఖర్‌బాబు, సిబ్బందికి డీజీపీ ద్వారకాతిరుమలరావు అవార్డులు అందించి అభినందించారు.