త్వరలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:54 PM
విద్యార్థి దశ నుంచి పరిశోధనా శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలోనే జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. ఈ నెల 29వ తేదీలోగా మండలస్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి చేయాలని బుధవారం ఆదేశించారు.
అమలాపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచి పరిశోధనా శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలోనే జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. ఈ నెల 29వ తేదీలోగా మండలస్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి చేయాలని బుధవారం ఆదేశించారు. సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి ఉత్తమ ఆవిష్కరణలు చేసేలా పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేయాలన్నారు. సుస్థిరమైన భవిష్యత్తు కోసం శాస్త్ర సాంకేతికత, ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, సమాచార రంగం, సేంద్రియ వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, వ్యర్థాలు-వనరుల నిర్వహణ వంటి ప్రాజెక్టులను తయారు చేయాలని డీఈవో సూచించారు. ప్రతీ పాఠశాల నుంచి ఏదో ఒక ప్రాజెక్టును తయారు చేసి జిల్లాస్థాయి ప్రదర్శనలో ఉంచాలన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశామన్నారు. ఇందుకోసం ప్రతీ మండలానికి ఒక నోడల్ హెచ్‌ఎంను ఎంపిక చేశామన్నారు. ప్రదర్శన నిర్వహణ, వేదికల ఏర్పాటు, తదితర వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సైన్స్ అధికారికి తెలియచేయాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి మండల విద్యాశాఖాధికారులను సమన్వయం చేసుకుంటూ మండలస్థాయి ప్రదర్శనలు పూర్తి చేయాలన్నారు. సందేహాల నివృత్తి కోసం జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, సెల్ 9640188525ను సంప్రదించాలన్నారు.