Share News

కొమ్మనాపల్లిలో తగ్గుతున్న డయేరియా కేసులు

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:47 AM

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా పదుల సంఖ్యలో నమోదైన డయేరియా కేసుల సంఖ్య ఆదివారం నాటికి ఐదుకు చేరి తగ్గుముఖం పట్టాయి.

కొమ్మనాపల్లిలో తగ్గుతున్న డయేరియా కేసులు

తొండంగి, జూన్‌ 16: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా పదుల సంఖ్యలో నమోదైన డయేరియా కేసుల సంఖ్య ఆదివారం నాటికి ఐదుకు చేరి తగ్గుముఖం పట్టాయి. జిల్లా అధికారులు, స్థానిక వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణలో డయేరియా రోగులకు వైద్య సేవలు అందించారు. స్థానిక సచివాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఐదుగురికి చికిత్స అందించారు. గత నాలుగు రోజులుగా సుమారు 80 మంది రోగులు డయేరియా బారిన పడ్డారు. వీరిలో 36 మందిని జీజీహెచ్‌కు తరలించారు. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొందరు చికిత్స పొందుతున్నారు. తాగునీటి కలుషితం కారణంగానే వ్యాధి వ్యాపించినట్లు గ్రామస్థులు చెప్పారు. తాగునీటి శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపారు. దానికి సంబంధించిన రిజల్ట్‌ రావాల్సి ఉంది. గ్రామంలో మురుగు కాల్వల పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. సిల్ట్‌ ట్రాక్టర్లతో తరలించారు. వివిధ గ్రామాల నుంచి డిప్యూటేషన్‌ పై నియమించిన పారిశుధ్య సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఐదు ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టే నిమిత్తం కోటనందూరు, తుని తదితర మండలాల నుంచి కూడా పారిశుధ్య సిబ్బందిని రప్పిస్తున్నారు.

గ్రామాన్ని సందర్శించిన జిల్లా అధికారులు

కొమ్మనాపల్లి గ్రామంలో జరుగుతున్న డయేరియా నివారణ కార్యక్రమాలను జిల్లా వైద్యశాఖాధికారి నర్సింహనాయక్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి రత్నకుమార్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సరిత, పెద్దాపురం ఆర్డీవో సీతారామాంజనేయులు సందర్శించారు.జిల్లా వైద్యాధికారి నర్సింహనాయక్‌ వైద్య సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. వైద్య సిబ్బందిని ఇంటింటా సర్వే చేయాలని ఆదేశించడంతో 334 గృహాలలో సర్వే నిర్వహించారు. అన్ని నీటి వనరులను క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. ఎంపీడీవో మార్కేండేశ్వరరావు, వైద్యాధికారులు డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ భారతి, గ్రామ సర్పంచ్‌ కోన అమ్మాజీ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం: యనమల రామకృష్ణుడు

కొమ్మనాపల్లి గ్రామంలో డయేరియా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే యనమల దివ్య గ్రామాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారన్నారు. తాను జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులతో మాట్లాడి రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించామన్నారు. జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారని, ఎవరూ ఎటువంటి భయాలకు లోనవ్వవద్దన్నారు. గ్రామంలో వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకూ నిరంతరాయంగా వైద్య శిబిరం నిర్వహించాలని సూచించామన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:48 AM