ఈ దహనకాండ ఆరేదెన్నడు..
ABN , Publish Date - Feb 11 , 2024 | 01:26 AM
కొవ్వూరు మున్సిపాల్టీలో డంపింగ్ యార్డు సమస్యకు దశాబ్దాలుగా పరిష్కారం లభించడం లేదు. హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం అయినా చెత్త సమస్య అలానే ఉంది. నియోజకవర్గంలో ఏ రహదారి చూసినా చెత్తపోసి తగలబెట్టిన దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.
కొవ్వూరులో అడుగడుగునా రోడ్ల పక్కనే చెత్త డంపింగ్
పట్టణంలో ప్రతి చోటా మండుతున్న చెత్త కుప్పలే దర్శనం
ప్రస్తుతం రైలు పట్టాల చెంతనే చెత్త డంపింగ్ చేసి దహనం
తగలబెట్టడంతో వ్యాపిస్తున్న పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
దశాబ్దాలకాలంగా పట్టణంలో తీరని డంపింగ్ యార్డు సమస్య
మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వనిత హయాంలో పూర్తి నిర్లక్ష్యం
కొవ్వూరు, ఫిబ్రవరి 10 : కొవ్వూరు మున్సిపాల్టీలో డంపింగ్ యార్డు సమస్యకు దశాబ్దాలుగా పరిష్కారం లభించడం లేదు. హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం అయినా చెత్త సమస్య అలానే ఉంది. నియోజకవర్గంలో ఏ రహదారి చూసినా చెత్తపోసి తగలబెట్టిన దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరు పట్టణంలో శాశ్వత డంపింగ్ యార్డు లేకపోవడంతో ఇంటింటా సేకరించిన చెత్తను గోదావరి గట్టుపై కాటన్ విగ్రహం నుంచి రైల్వేస్టేషన్ వరకు మినీబైపాస్ లో రోడ్డుకు ఇరుపక్కల పోస్తున్నారు. చెత్తను రహదారి వెంబడి పారబోసి తగలబెట్టడంతో రోడ్డంతా దట్టంగా పొగ వ్యాపించి ఎదుటవచ్చే వారు కొందరు కనిపించక ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. ఆ రహదారిలో ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాల్సిందేనని ప్రజలు వాపోతున్నారు. కొవ్వూరు పట్టణాన్ని ఆనుకుని లేఅవుట్‌లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు మున్సిపల్ డంపింగ్ యార్డుకు కనీసం 5 ఎకరాల స్థలం సేకరించలేకపోతున్నా రా అంటూ ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు పట్టణానికి ఆరు దశాబ్దాలుగా డంపింగ్ యార్డు సమస్యగా మారింది. 1965 ఫిబ్రవరి 1న కొవ్వూరు పురపాలక సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంటింటా సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్ యార్డుకు స్థలసేకరణ చేయడంలో అధికారులు, నాయకులు వైఫల్యం చెందారు. 16.23 కిలోమీటర్లు విస్తరించి ఉన్న కొవ్వూరు పట్టణంలో 23 వార్డులు సుమారు 60 వేలకు పైగా జనాభా, 13 వేల నివాస గృహాలు ఉన్నాయి. 23 వార్డుల నుంచి ప్రతిరోజు 23 టన్నులు చెత్త వచ్చి పడుతుంది. 2013-14లో నందమూరు రోడ్‌లో సుమారు 2 ఎకరాల భూసేకరణ చేసి, దానికి సంబంధిం చి చెల్లించవలసిన సొమ్మును మున్సిపల్ అఽధికారులు రెవెన్యూ శాఖకు సుమారు రూ.30 లక్షలు జమ చేశారు. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో డంపింగ్ యార్డుకు సేకరిస్తున్న భూయజమాని రేటు విషయంలో కోర్టును ఆశ్రయించడంతో డంపింగ్ యార్డు సమస్య ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అప్పటివరకు 1వ వార్డు రాజీవ్‌కాలనీలో నివాసాలను ఆనుకుని ఉన్న మున్సిపల్ చెరువును పూడ్చివేసి చెత్తను తాత్కాలికంగా డంపింగ్ చేసేవారు. వర్షాకాలంలో పారిశుధ్య సిబ్బంది చెత్తను రోడ్డుపై పారవేయడంతో దుర్గంధం వెదజల్లుతోందని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామంలో జిల్లా పరిషత్‌కు చెందిన 7 ఎకరాల స్థలాన్ని గుర్తిం చి, అప్పట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కొవ్వూరు పట్టణంలో సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్ యార్డుకు కేటాయించారు. మున్సిపల్ సిబ్బంది పోలీసుల సమాయంతో చెత్తను వాహనాల్లో పంగిడి తరలిస్తుండగా పంగిడి గ్రామ ప్రజలు సుమారు 11 కిలోమేటర్లు దూరం నుంచి చెత్తను తీసుకువచ్చి పంగిడి గ్రామంలో వేయడానికి వీలులేదని రోడ్డెక్కి ధర్నాలు చేపట్టడంతో చెత్త సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో పట్టణంలోని 23 వార్డుల్లో ఇంటింటా సేకరించిన చెత్త వేయడానికి స్థలం లేకపోవడంతో పవిత్ర గోదావరి తీరం గోష్పాద క్షేత్రానికి సమీపంలోని పాతరైలు వంతెన వద్ద రైల్వే బైపాస్‌లో కాటన్ విగ్రహం వద్ద మున్సిపల్ ఖాళీస్థలంలో పారవేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ స్థలాన్ని పట్టణ పోలీస్‌స్టేషన్, సబ్‌జైలు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు కేటాయించారు. మున్సిపల్ స్థలాలను ఒక్కొక్కటిగా ఇతర శాఖలకు బదలాయిస్తున్నారు. మున్సిపల్ డంపింగ్ యార్డుకు పంగిడిలో సేకరించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాతరైలు వంతెన వద్ద కాటన్ విగ్రహం నుంచి రైల్వేస్టేషన్ వరకు మినీబైపాస్‌కు ఇరుపక్కలా చెత్తను పారబోసి తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డు సమస్య పురపాలక సం ఘం ఏర్పడిన నాటి నుంచి కొవ్వూరును పట్టి పీడిస్తోంది. గత ఆరు దశాబ్ధాలుగా ఈ సమస్య పరిష్కారానికి ఏ ఒక్కరూ పరిష్కారం చూపకపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇద్దరు మంత్రులుగా కూడా పనిచేశారు. ఒకరు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖామంత్రి కేఎస్ జవహర్ హయాంలో సమస్య ఎటూ తేలలేదు. ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత హయాంలో అయినా పరిష్కారం దొరుకుతుందని ఆశించిన పట్టణవాసులకు నిరాశే ఎదురయ్యింది. దీనికితోడు మున్సిపల్ అధికారులు పట్టణానికి కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నారు. ఎక్కడో మారుమూలన వేయవలసిన చెత్తను ప్రతిరోజు లక్షలాదిమంది తిరిగే రాష్ట్ర రహదారి పక్కన పారవేస్తూ నిప్పుపెడుతున్నారు. దీంతో ఆ రహదారిలో పొగ వ్యాపించి వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. కొందరు అస్వస్థతకూ గురవుతున్నారు.
ఇదేం పాలనరా బాబూ...
ఆహ్లాదకరమైన అఖండ గోదావరి సోయగాలకు నెలవుగాను, అధ్యాత్మిక కేంద్రంగాను ఉన్న కొవ్వూరు పట్టణం ప్రస్తుతం ఈ చెత్త సమస్యతో అధ్వా నంగా మారింది. ఎక్కడా చోటులేనట్టు గోదావరి చెంతనే చెత్తను డంప్ చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. స్థానికంగా ఉంటున్న అధికారులెవ రికీ చెత్త సమస్య పట్టడంలేదు. ప్రతిరోజు తిరిగే ప్రజలు, వాహనదారులు మాత్రం దుర్వాసన భరించలేక, ఇదేం పాలనరా బాబూ అని చూసినవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు చెత్తకు నిప్పు పెట్టడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు తగలబడి పొగ రహదారి అంతటా వ్యాపిస్తోంది. రహదా రి కనిపించక వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ పొగ నుంచి విషవాయువాలు వ్యాప్తిచెంది ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఎంతో విలువైన స్థలంలో గత ప్రభుత్వం సుమారు 15 ప్రభుత్వ శాఖల కార్యాలయాల సముదాయం నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదించి చర్యలు చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో ఆ స్థలాన్ని చెత్తవేసి డంపింగ్ యార్డుగా మార్చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కాటన్ విగ్రహం వద్ద చెత్త డంపింగ్ చేస్తు న్న స్థలంలో పట్టణ పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. మున్సిపాల్టీ ఆ స్థలంలో చెత్తను తొలగించడానికి సుమారు కోటి రూపాయలు వెచ్చించి హుటాహుటీన చెత్తను మండలంలోని దేచర్ల క్వారీ గోతులు, గోష్పాదక్షేత్రం, మున్సిపల్ వాటర్‌వర్క్సు స్థలాల్లో పారబోశారు. మున్సిపల్ స్థలాలను ఇతరశాఖకు బదలాయించడంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు చూపిస్తున్న శ్రద్ధ దీర్ఘకాలంగా పట్టణాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారంలో చూపడం లేదని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఖాళీచేసిన స్థలంలో ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్ నిర్మాణం చేపట్టలేదు. చెత్త తొలగించిన గోతుల్లో వర్షపునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా డంపింగ్ సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంది.