గ్రామాల్లోకి ఏలేరు వరద నీరు
ABN , Publish Date - Sep 11 , 2024 | 12:20 AM
పిఠాపురం రూరల్, సెప్టెంబరు 10: మండలంలోని పలు గ్రామాల్లోకి ఏలేరు నీరు చేరింది. భోగాపురం ఎస్సీ కాలనీ, సగరపు పుంత తదితర ప్రాంతాలు, మాధవపు రం, గో
పిఠాపురం రూరల్, సెప్టెంబరు 10: మండలంలోని పలు గ్రామాల్లోకి ఏలేరు నీరు చేరింది. భోగాపురం ఎస్సీ కాలనీ, సగరపు పుంత తదితర ప్రాంతాలు, మాధవపు రం, గోకివాడ గ్రామాల్లో పలువురు గృహాలు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా వరద ముంపులో చిక్కుకున్నాయి. పిఠాపురం-గోకివాడ మధ్య గోకివాడకు సమీపం లో రహదారిపై ఏలేరు వరద నీరు 4 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నది. ఇక్కడ రోడ్డు, పంటపొలాలు ఏకమయ్యాయి. దీంతో గోకివాడకు రాకపోకలు నిలిచిపోయా యి. గొల్లప్రోలు-బి.ప్రత్తిపాడు-భోగాపురం, పిఠాపురం-రాపర్తి రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తున్నది. వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పిఠాపురం-జములపల్లి రోడ్డులో 120 ఏళ్ల నాటి రావిచెట్టు ఏలేరు వరద ఉధృతికి కూలిపోగా రాకపోకలు నిలిపివేశారు. పిఠాపురం రూరల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జలవనరుల శాఖ సీఈ పర్యటన
పిఠాపురం, సెప్టెంబరు 10: ఏలేరు వరదల కారణంగా గండ్లు పడిన ప్రాంతాలను జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ పుల్లారావు మంగళవారం పరిశీలించారు. పిఠాపురం, గొల్లప్రోలు మండలాల పరిధిలో 15గండ్లు పడ్డాయని అధికారులు వివరించారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ శేషగిరిరావు, ఏఈలు శ్రీనివాస్, పద్మజ, శివకృష్ణ తదితరులు ఉన్నారు.