మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:34 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు నేరుగా ధాన్యాన్ని సమీప మిల్లులకు అమ్ముకునే విధంగా కార్యచరణ రూపొందించి అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ విధానం ప్రారంభ దశలో సజావుగానే సాగింది. అనంతరం అఽధికారుల అలసత్వం కారణంగా రైతులు పండించిన ధాన్యం కళ్లాల్లో నిలిచిపోయింది.
రావులపాలెం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు నేరుగా ధాన్యాన్ని సమీప మిల్లులకు అమ్ముకునే విధంగా కార్యచరణ రూపొందించి అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ విధానం ప్రారంభ దశలో సజావుగానే సాగింది. అనంతరం అఽధికారుల అలసత్వం కారణంగా రైతులు పండించిన ధాన్యం కళ్లాల్లో నిలిచిపోయింది. ఇప్పుడు టార్గెట్ లేదని పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ జరగడం లేదు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో స్వర్ణరకం, 1318 వరి వంగడాలను రైతులు సాగుచేశారు. అయితే స్వర్ణరకం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేకపోవడంతో కొద్దిమేర మాత్రమే సాగుచేశారు. మిగిలినదంతా 1318 రకం. ఇది ప్రస్తుతం కోతలు పూర్తిచేసుకుని ధాన్యపు రాశులుగా ఉంది. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతు సేవా కేంద్రాలకు తీసుకెళ్తుంటే కొద్దిమేర మాత్రమే టార్గెట్ ఉందని, ఆ మొత్తంలోనే ధాన్యాన్ని తీసుకుంటున్నారు. దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కొందరూ అధికారులు అయితే ధాన్యాన్ని బయట అమ్మేసుకోమని రైతులకు చెబుతుండటంతో రైతులు అయోమయంలో పడ్డారు. కొందరు రైతులు మిల్లు వద్దకు ధాన్యం శాంపిల్స్‌ను పట్టుకుని వెళ్లగా పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. కేవలం కొద్దిమేర మాత్రమే తీసుకుని మిగిలినది టార్గెట్ లేదని చెబుతున్నారు. అలా అని ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు ధాన్యం తరలిస్తే ఖర్చులు అధికమైపోతాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులను అన్నివిధాల ఆదుకుని ఆర్థికాభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవాలనే ఓ వైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ఆ దిశగా పనిచేయడం లేదు. దీంతో సీఎం సంకల్పం నీరుగారిపోతోంది. ఒక పక్క వాతావరణ మార్పులతో ఆందోళనలో ఉన్న రైతులకు పండించిన పంట అమ్ముకునేందుకు అనేక అడ్డంకులు ఏర్పడటంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.