దాబాలపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు
ABN , Publish Date - May 31 , 2024 | 12:40 AM
ఇష్టం వచ్చిన రీతిలో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న దాబాలపై ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం బెండపూడి శివారులో ఉన్న దాబాలపై ఫుడ్ కమిషనర్,అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కొట్ర వెంకట సుబ్బారావు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తొండంగి, మే30: ఇష్టం వచ్చిన రీతిలో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న దాబాలపై ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం బెండపూడి శివారులో ఉన్న దాబాలపై ఫుడ్ కమిషనర్,అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కొట్ర వెంకట సుబ్బారావు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నవరం వచ్చే యాత్రికులకు నాణ్యమైన ఆహార పదార్థాలు లభించడం లేదని పరిసర ప్రాంతాల్లో ఉన్న దాబాలు ఇతర విక్రయ ప్రాంతాల్లో నాసిరకం ఆహార పదార్థాలు ఉంటున్నాయంటూ కమిషనర్‌కు అందిన ఫిర్యాదు మేరకు ఆయన ఆదేశాలపై దాడులు జరుపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. కోకిల, రాయుడు దాబాలపై దాడులు జరపగా రెండు చోట్ల ఫుడ్ లైసెన్స్ పొందకుండానే వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించామన్నారు. కోకిల రెస్టారెంట్‌లో నిల్వ ఉంచిన మాంసం, వండిన మాంస పదార్థాలు, రుచి కోసం వినియోగిస్తున్న టేస్టింగ్ సాల్ట్‌లను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. ఆరోగ్యంపై ప్రభావం చూపించే రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించి చికెన్ వింగ్స్ శాంపిల్ సేకరించామన్నారు. రాయుడు దాబాలో కూడా టేస్టింగ్ సాల్ట్ వినియోగిస్తున్నట్లు గుర్తించి ధమ్ బిర్యానీ శాంపిల్ సేకరించామన్నారు. సేకరించిన శాంపిళ్ళను ల్యాబ్ కు పంపి వచ్చిన ఫలితం ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీరికి నోటీసులు జారీ చేశామన్నారు. అన్నవరం వచ్చిన భక్తులే ఎక్కువగా ఈ దాబాలకు వస్తుంటారు. అయితే వచ్చిన వారు మళ్లీ రారు, ఫిర్యాదు చేయరు అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. లైసెన్స్ లేకుండా, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడిపే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అన్నవరంలో కూడా దాడులు చేశామన్నారు.