నిలకడగా గోదావరి
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:01 AM
గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వస్తుండడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయల వెంబడి ఉన్న కాజ్‌వేలన్నీ దాదాపు మునిగిపోయాయి. వరద తీవ్రతపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సమీక్షించారు.
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వస్తుండడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయల వెంబడి ఉన్న కాజ్‌వేలన్నీ దాదాపు మునిగిపోయాయి. వరద తీవ్రతపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సమీక్షించారు. వరద ప్రభావిత గ్రామాల్లో ఉన్న ప్రత్యేక అధికారులతో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. నదీ పరివాహక లంక గ్రామాల్లోని కొబ్బరి తోటల్లో రాత్రివేళల్లో దొంగతనాలు జోరుగా సాగుతున్నాయి. రైతులు ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో కొందరు వ్యక్తులు ప్రత్యేక పడవల సహాయంతో దింపులు తీసేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువులకు దాణా కరువై సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండుగడ్డి, పచ్చగడ్డి లభ్యత లేకపోవడంతో పశువులు దాణా సమస్యను ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని కోరుతున్నారు. రేవుల వద్ద ఉన్న వ్యాపార సంస్థలు ముంపునకు గురయ్యాయి. కోటిపల్లి రేవు, సఖినేటిపల్లితో సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న రేవుల్లోని వ్యాపార దుకాణాల్లోకి వరదనీరు చేరడంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేవుల్లో రాకపోకలు సైతం నిలిపివేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద వరద నీటి ప్రవహం నిలకడగా కొనసాగుతుంది. భద్రాచలం వద్ద అదే పరిస్థితి ఉన్నప్పటికీ మళ్లీ వరద పెరిగే అవకాశం ఉందన్న అధికారుల హెచ్చరికలతో అటు ప్రజలు, ఇటు కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.